నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారదతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి, నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వం, ప్రభుత్వ పాలనపై ప్రజల్లో భారీ సానుకూలత ఉందన్నారు. రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కాంగ్రెస్‌కు అఖండ మద్దతు లభిస్తోందని తెలిపారు. క్షేత్రస్థాయిలో స్పందన అద్భుతంగా ఉండడంతో రెండు వంతుల మెజారిటీ దిశగా ముందుకెళ్తున్నామని చెప్పారు.
49 వార్డుల్లో 45 వార్డులు పర్యటించి ముమ్మర ప్రచారం నిర్వహించినట్లు పేర్కొన్నారు. రూ.500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డుల పునరుద్ధరణ వంటి హామీలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. కామారెడ్డి అభివృద్ధికి రూ.200 కోట్ల ప్రతిపాదనలు పంపగా, ఇండోర్ స్టేడియం సహా పలు పనులు మంజూరయ్యాయని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేస్తూ నిరుద్యోగులను గత పాలకులు మోసం చేశారని ఆరోపించారు. అంతర్గత అంచనాల ప్రకారం కాంగ్రెస్ 32 నుంచి 35 వార్డులు గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ఓటర్లను కోరారు.



