– ఎస్సీ, ఎస్టీ నిధుల్లో 70 శాతం భారీ కోత
– గత ఏడాది రూ. 57,000 కోట్ల కేటాయింపు
– ఈయేడు రూ.19,000 కోట్లు మాత్రమే
– ఎస్సీ, ఎస్టీ నిధుల్లో మొత్తం రూ.37,000 కోట్ల కోత చరిత్రలోనే మొదటిసారి
– ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ హామీలలో ఒక్కటీ అమలు కాలేదు
– ఎస్సీ, ఎస్టీల భవిష్యత్తును అసెంబ్లీ సాక్షిగా పాతర వేసిన ప్రభుత్వం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఎస్సీ, ఎస్టీ వర్గాలను కాంగ్రెస్ పార్టీ నిండా ముంచిందని, ఎస్సీ, ఎస్టీ నిధుల్లో 70 శాతం భారీ కోత విధించడం ద్వారా తన నైజాన్ని బయట పెట్టుకుందని బాల్కొండ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ నాయకులు విమర్శించారు. గత ఏడాది రూ.57,000 కోట్ల కేటాయింపులు చేసి, ఈయేడు రూ.19,000 కోట్లు మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు.ఎస్సీ, ఎస్టీ నిధుల్లో మొత్తం రూ.37,000 కోట్ల కోత చరిత్రలోనే మొదటిసారని, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ హామీలలో ఒక్కటీ అమలు కాలేదన్నారుఎస్సీ, ఎస్టీల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా పాతర వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం వేల్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాల్కొండ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ నాయకులు పసుల ముత్తేన్న, నీరడి భాగ్య, మైలారం సుధాకర్, శర్మ నాయక్, తిరుపతి నాయక్, రాజన్న, గంధం మహిపాల్, మాలవత్ ప్రకాష్, గడలా ప్రసాద్, తుక్కజీ నాయక్, పర్స నవీన్ తదితర నాయకులు మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణ సబ్బండ వర్గాలను మోసం చేసిందన్నారు.ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీవ్రమైన ద్రోహం చేసిందని పేర్కొన్నారు.మూడు బడ్జెట్లలో వేల కోట్ల రూపాయలు పెట్టినామని చెప్పి అత్యంత స్వల్పంగా ఖర్చు చేసిందని, సబ్ ప్లాన్ అమలును పక్కన పెట్టిందన్నారు.అన్నింటికంటే దారుణంగా ఈ సంవత్సరం బడ్జెట్లో దేశంలో ఎక్కడా లేని విధంగా 70 శాతం నిధులను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే నిధుల్లోనూ కోత పెట్టడం అన్యాయమన్నారు.
70 శాతం నిధుల కోత అంటే ఎస్సీ, ఎస్టీ జీవితాలపైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడి అన్నారు.ప్రతి ఏటా ప్రతి వర్గానికి నిధులను పెంచిన ప్రభుత్వాలని చూసామని, కానీ మొదటిసారి 37 వేల కోట్ల రూపాయల భారీ నిధులను కోత విధించిన దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉందన్నారు.గత ఏడాది సుమారు రూ.57 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పుకున్న ప్రభుత్వం, ఈసారి గంప గుత్తగా కేవలం రూ.19 వేల కోట్లు మాత్రమే కేటాయించి రూ.37 వేల కోట్ల కోత పెట్టిందన్నారు.ఇది సామాజిక న్యాయం ఏమాత్రం కాదుని, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి అభివృద్ధిని, భవిష్యత్తును సమాధి చేయడమేని ఆరోపించారు.
ఇక నిధుల కోత మాత్రమే కాదు, ఎన్నికల ముందు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలులోనూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వచ్చి మరి ఇచ్చిన చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా పూర్తిగా ఎస్సీ, ఎస్టీలను మూడు సంవత్సరాలలో అడుగడుగునా మోసం చేస్తూనే ఉన్నారన్నారు.అంబేద్కర్ అభయ హస్తం కింద కేసీఆర్ ఇస్తున్న 10 లక్షలు కాదు, 12 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఒక్క వ్యక్తికి కూడా ఈ పథకాన్ని అమలు చేయలేదని విమర్శించారు.మాల, మాదిగ ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు, ప్రతి కార్పొరేషన్ కి రూ.750 కోట్ల నిధుల కేటాయింపు అని చెప్పి మోసం చేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీల భవిష్యత్తును అసెంబ్లీ సాక్షిగా, ఈ బడ్జెట్ సాక్షిగా పాతర వేసిందని నాయకులు విమర్శించారు.
ఇంత దారుణంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలను మోసం చేసిన ప్రభుత్వం దేశ చరిత్రలో లేదని, బడ్జెట్ సాక్షిగా వారి భవిష్యత్తును పాతర వేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఈ అన్యాయాన్ని తిప్పికొడతారని హెచ్చరించారు.ఈ సమావేశంలో తాళ్ళ రాజన్న, జిన్నా శోభన్, సౌడ రమేష్, మోహన్ దాస్, లక్కం నర్సయ్య, కళ్యాణ్, సాయన్న, తదితరులు పాల్గొన్నారు.



