ఆ పార్టీ మోసాలను వివరించేందుకే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ చేసిన మోసాలను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ‘కాంగ్రెస్ బాకీ కార్డ్’ ఉద్యమం మొదలు పెట్టినట్టు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ ఉందో తెలిపేలా ఉద్యమం ఉంటుందని చెప్పారు. హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ కు పంచాయతీ, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం మాజీ మంత్రులతో కలిసి హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం కాంగ్రెస్ అడ్డమైన హామీలిచ్చిందని విమర్శించారు. గద్దెనెక్కిన తర్వాత వాటిని గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్‌ఎస్ పార్టీ సమరశంఖం పూరించిందని ప్రకటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారెంటీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడిందో లెక్కలతో సహా ప్రజల ముందుంచేందుకు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని మొదలుపెట్టినట్టు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ కార్డుకు విరుగుడే ఈ ‘బాకీ కార్డు’ అని హెచ్చరించారు. తమను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పే అవకాశం ప్రజలకు వచ్చిందని తెలిపారు. బాకీ కార్డును బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రతి ఇంటికి తీసుకెళ్తారని చెప్పారు.
కాంగ్రెస్‌ను నమ్మితే ప్రజలు మోసపోతారని కేసీఆర్ ముందు చెప్పిందే నేడు నిజమైందని తెలిపారు. మొదటి క్యాబినెట్‌లోనే హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 30కి పైగా క్యాబినెట్ సమావేశాలు నిర్వహించినా ఆ ఊసే లేదని ఎద్దేవా చేశారు. బాకీ కార్డులో ప్రతి అక్షరం రేవంత్ సర్కార్ మోసానికి నిలువుటద్దమని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని వర్గాలను నిలువునా ముంచిందని కేటీఆర్ విమర్శించారు. రైతులకు ఎకరాకు రూ.15 వేలు, రూ.2 లక్షల రుణమాఫీ, వరికి రూ.500 బోనస్, కౌలు రైతులు, రైతు కూలీలకు రూ.15 వేలు, రూ.12 వేలు ఇస్తామన్న హామీల మేరకు అవి బాకీలు కావా? అని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాల హామీ, నెలకు రూ.4 వేలు నిరుద్యోగ భృతి హామీకి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఒక్కో మహిళకు నెలకు రూ.2,500 హామీ మేరకు రూ.55 వేల చొప్పున, పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం హామీ మేరకు 8 లక్షల మంది ఆడబిడ్డలకు 8 లక్షల తులాల బంగారం ఇవ్వకపోవడం నయవంచన కాదా? అని మండిపడ్డారు. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4 వేల పెన్షన్ హామీ మేరకు ఒక్కొక్కరికి రూ.44 వేలు, వికలాంగులకు నెలకు రూ.6 వేలు హామీ మేరకు ఒక్కొక్కరికి రూ.44 వేలు బాకీ ఉన్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, విద్యార్థినులకు స్కూటీలు, యువతకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు, ఆటో డ్రైవర్లకు రూ.24 వేలు బాకీ ఉందని కేటీఆర్ తెలిపారు.