– బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్
– బీఆర్‌ఎస్‌లోకి పలువురు నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించి మోసం చేస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురేయాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు డాక్టర్ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో, కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారిలో టీపీసీసీ మెంబర్, సింగిల్ విండో మాజీ చైర్మెన్ అర్షద్ హుస్సేన్, కౌటాల మాజీ ఎంపీపీ బుసార్కర్ విశ్వనాథ్, రత్నం సోమయ్య, తాటినగర్ మాజీ సర్పంచ్ బస్కార్కర్ అశోక్, కౌటాల మాజీ ఎంపీటీసీ, బారే కుల సంఘం నాయకులు కె.నందయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు పాకాల బిక్షం, గుమ్మల బాలయ్య, ఆదివాసీ నాయకులు ఎన్క శ్రీహరి తదితరులున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..త్వరలోనే ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటిస్తాననీ, బహిరంగ సభ నిర్వహించుకుందామని హామీని చ్చారు. ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ..సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కేవలం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు, నక్క మనోహర్, నవీన్, మండల కన్వీనర్లు ముస్తాఫిజ్, షాకిర్, బండు పటేల్, తదితరులు పాల్గొన్నారు.
హామీలు అమలు చేయని కాంగ్రెస్
– కర్రుకాల్చి వాత పెట్టేందుకు ప్రజలు రెడీ : కేటీఆర్
– బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నేతలు
హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ రించారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వికారాబాద్ నియోజక వర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి కేటీఆర్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ప్రజల్లో విపరీతమైన కోపం, అసం తృప్తి ఉన్నాయని తెలిపారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు సీఎం రేవంత్ ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. వికారాబాద్‌లోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో బీఆర్‌ఎస్ గెలిచాక కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్న అధికారులు అధికారులు గా పనిచేయడం ప్రారంభిస్తారని తెలిపారు. కాంగ్రెస్ మోసాలను ఇంటింటికి తిరిగి వివరిం చాలని సూచించారు. మీ సేవ కార్యాలయాల ద్వారా ఇచ్చే రేషన్ కార్డులను జారీ చేసి ముఖ్య మంత్రి గప్పాలు కొట్టుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయబోమనీ, తిరిగి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలను, నాయకులను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా ఏర్పాటుతో పాటు బీఆర్‌ఎస్ చేసిన కార్యక్రమాలను సరిగ్గా ప్రచారం చేసుకోలేక పోయినట్టు కేటీఆర్ తెలిపారు. తొమ్మిదేళ్లలో 6.5 లక్షల కార్డులిచ్చినట్టు గుర్తుచేశారు. అనేక హామీలు, గ్యారంటీలిచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు లు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా ప్రతివర్గం కాంగ్రెస్ చేతిలో మోసపోయిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రీఫైనల్ లాంటివని చెప్పారు. ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసి గెలిపించుకోవాలని సూచించారు.