ఈనెల 9న జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా
విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) విజ్ఞప్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని, ఇండ్లు లేని పేదలందరికీ సొంత ఇంటి కలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మార్చి 9న జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు సీపీఐ(ఎం) ప్రకటించింది. నగరంలో ఇండ్లు లేని లక్షలాది మంది పేదలు ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం వారి ఆశలను నెరవేర్చడంలో విఫలమవుతోందని ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ అన్నారు. బుధవారం హైదరాబాద్ గోల్కొండ చౌరస్తాలోని సీపీఐ(ఎం) నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నగరంలో సుమారు 10 లక్షల మంది పేదలు ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వానికి ఇండ్ల నిర్మాణంపై నిర్దిష్ట ప్రణాళిక లేదన్నారు. దరఖాస్తుదారులను కేటగిరీలుగా విభజించి ఆన్‌లైన్‌లో ఉంచడం తప్ప, ఆచరణలో ఇంటి కల నెరవేరడం లేదని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న సుమారు 35 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పూర్తి చేసి వెంటనే లబ్దిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమూ దరఖాస్తులు స్వీకరించి ఊరిస్తోందే తప్ప, ఇండ్ల నిర్మాణానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. గరంలోని స్లమ్‌లలో దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న గుడిసెవాసులకు అదే స్థలంలో జీ ప్లస్-3 పద్ధతిలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎం) తరపున డిమాండ్ చేశారు.
25, 30 ఏండ్లు దాటిన వాంబే, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇండ్ల స్థానంలో కొత్త ఇండ్లను నిర్మించాలని కోరారు. నగరంలో సొంత ఇండ్లు లేక అద్దె ఇండ్లలో నివసిస్తూ ఆర్థికంగా చితికిపోతున్న లక్షలాది కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వ స్థలాలను సేకరించి ఇండ్ల నిర్మాణానికి పూనుకోవాలన్నారు. నగర కోర్ సిటీలో పరిశ్రమలను శివారులకు తరలించిన తర్వాత మిగిలిన భూములను, ఇతర ప్రభుత్వ భూములను ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేటాయించాలని సూచించారు. ఈనెల 9న జరిగే ధర్నాను విజయవంతం చేయాలని, ఇండ్ల దరఖాస్తుదారు లందరూ పాల్గొని తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు ఆర్.వెంకటేష్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



