పోలీసు మధ్యవర్తుల అంతర్గత ప్రయత్నాలు
భారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటుకు రంగం సిద్ధం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో త్వరలోనే భారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇందుకు కొందరు పోలీసు మధ్యవర్తులు అంతర్గత ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని ఒకపక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తుండటం, మరోపక్క దండకారణ్యంలో ఉన్న మావోయిస్టుల కీలక స్థావరాలపై భారీ సంఖ్యలో పోలీసు బలగాలు ఆపరేషన్ కగార్ పేరిట దాడులను ముమ్మరం చేయటంతో ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులు మరణించిన విషయం విదితమే. అందులో మావోయిస్టు అగ్రనేతలు, ఆ పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజ్‌తో పాటు మోడెం బాలకృష్ణ, సుధాకర్, సత్యనారాయణరెడ్డి ఎలియాస్ కోసాతో పాటు పలువురు అగ్రనేతలు మరణించారు.
‘చర్చల్లేవ్.. లొంగిపోవటమే ఏకైక మార్గం’
ఈ దశలోనే ఆ పార్టీ అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ సోనీ ఎలియాస్ అభరు పేరిట వచ్చిన ఒక పత్రికా ప్రకటన ఇటు ప్రభుత్వం, అటు మావోయిస్టుల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తాము ఆయుధాలను పక్కనబెట్టి కాల్పుల విరమణను పాటిస్తామనీ, దీనికి సంబంధించి పార్టీ క్యాడర్‌తో సంప్రదిస్తున్నామని ఆయన ప్రకటించారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో తొలిసారిగా ఆ ప్రకటనపై తన ఫొటోను కూడా పెట్టుకున్నారు. దీనికి ప్రతిగా అదేపార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జగన్ ప్రకటన విడుదల చేస్తూ ఇది పూర్తిగా వేణుగోపాల్‌రావు వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు. దీనికి పార్టీతో సంబంధం లేదనీ, ఒకవేళ ఆయన లొంగిపోదల్చుకుంటే వెళ్లవచ్చని వివరించారు. వీరి మధ్య సాగుతోన్న ప్రకటనల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్పందించాయి. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదనీ, ఆయుధాలను వీడి లొంగిపోవటం ఒక్కటే వారి ముందున్న మార్గమని స్పష్టం చేశాయి.
లొంగిపోయి ప్రభుత్వ చేయూతను స్వీకరించాలి : డీజీపీ శివధర్‌రెడ్డి
రెండ్రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా 103 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందులో 47 మంది మావోయిస్టులలో ఒక్కొక్కరిపై కోటి రూపాయలకు పైగా ప్రభుత్వ రివార్డు ఉన్నది. ఈ పరిస్థితుల్లోనే రాష్ట్ర నూతన డీజీపీ శివధర్‌రెడ్డి సైతం తాను బాధ్యతలు చేపట్టిన రోజు విలేఖరులతో మాట్లాడుతూ.. వేణుగోపాల్‌రావు చేసిన ప్రకటనను ఆయన వ్యక్తిగతంగా చేసినదిగా కాకుండా అధికారికంగా చేసిందిగా తాము భావిస్తున్నామనీ, కారణం.. ఆయుధాలను పక్కనబెట్టే నిర్ణయానికి సంబంధించి వారి కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజ్ ఎన్‌కౌంటర్‌లో మరణించకముందే అగ్రనాయకత్వం మాట్లాడుకున్న విషయంగా తమకు విశ్వసనీయ సమాచారమున్నదని తెలిపారు.
ఈ పరిస్థితుల్లోనే మావోయిస్టులు లొంగిపోయి, ప్రభుత్వం అందించే చేయూతను స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. యాంటీ మావోయిస్టు కార్యకలాపాల్లో అపారమైన అనుభవమున్న శివధర్‌రెడ్డి.. ప్రస్తుతం డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. దీంతో వారి కార్యకలాపాలను అణచివేయటానికి ఆయన మరింత గట్టిగా పని చేస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే కొందరు పోలీసు మధ్యవర్తులు మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌తో లొంగు బాటుకు సంబంధించి అంతర్గత సంప్రదింపులను అత్యంత రహస్యంగా జరుపుతున్నట్టు తెలిసింది. ఆయనతో పాటు మరికొందరు అగ్రనేతలు, కీలకమైన బాధ్యతల్లో ఉన్న క్యాడర్ కూడా పెద్ద సంఖ్యలో లొంగిపోయేలా గట్టి ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలిసింది. ఇందుకు వేణుగోపాల్ నుంచి వచ్చిన ఆయుధాలను వీడే ప్రతిపాదన ఆధారంగానే ఈ అంతర్గత చర్చలను పోలీసు మధ్యవర్తులు కొనసాగిస్తున్నారనీ, ఈ ప్రక్రియ త్వరలోనే ఫలితం సాధిస్తుందని పోలీసు అధికార వర్గాలు కూడా భావిస్తున్నాయి.