Thursday, July 31, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబడులపై నిరంతర పర్యవేక్షణ

బడులపై నిరంతర పర్యవేక్షణ

- Advertisement -

– అందరికీ నాణ్యమైన విద్యనందించాలి
– విద్యా ప్రగతిలో డీఈవోలే కీలకం : విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా చెప్పారు. రాష్ట్రంలో అందరికీ విద్యను అందుబాటులో తేవాలని అన్నారు. బడులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. విద్యారంగ ప్రగతిలో జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవో) కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో బుధవారం డీఈవోల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు సమానమైన విద్యనందించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజన్‌కు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. విద్యారంగంలో ఇటీవల అనేక విజయాలను సాధించామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది కంటే ప్రస్తుత విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని అన్నారు. ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్‌ నికోలస్‌ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే కీలక బాధ్యత డీఈవోలపైనే ఉందన్నారు. అపార్‌, ఆధార్‌ నమోదు యూడైస్‌ వివరాలు డిజిటలైజ్‌ అవుతున్నాయని వివరించారు. పర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌ (పీజీఐ)లో తెలంగాణ ర్యాంకు మెరుగైందని చెప్పారు. న్యాస్‌ సర్వేలోనూ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని అన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌, లిప్‌ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపర్చాలని సూచించారు. పదో తరగతి పరీక్షలపై డీఈవోలు దృష్టిసారించాలని కోరారు. ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. పీఎంశ్రీ పాఠశాలలను మోడల్‌ స్కూళ్లుగా తీర్చిదిద్దాలన్నారు. వాటిలో మౌలిక వసతులను మెరుగుపర్చాలనీ, విద్యా ప్రమాణాలను పెంచాలని సూచించారు. ఉపాధ్యాయుల సర్దుబాటుపై చర్చించామన్నారు. విద్యాహక్కు చట్టంలోని 12(1)సీని అమలు చేయాలని చెప్పారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలను నాటాలని కోరారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలని అన్నారు. డీఈవోలు, సమగ్రశిక్ష, ఎస్‌సీఈఆర్టీ మధ్య అవగాహన పెరగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు పివి శ్రీహరి, రాధారెడ్డి, లింగయ్య, జి రమేష్‌, ఎ కృష్ణారావు, సిహెచ్‌ రమణకుమార్‌తోపాటు జాయింట్‌ డైరెక్టర్లు, ఆర్జేడీలు, డీఈవోలు తదితరులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -