- సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు..ఆందోళనలో సామాన్య ప్రజలు
నవతెలంగాణ-మల్హర్ రావు: నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన వంట నూనెల ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. గత నెలలో ఉన్న ధర కంటే ప్రస్తుతం కిలో ప్యాకెట్ పై రూ.30 పెరిగింది. దాదాపు 20 రోజుల క్రితమే పామాయిల్, ఫ్రీడమ్ ఆయిల్,పల్లీ నూనె ధరలన్నీ పెరిగి పోయాయి. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపి హోల్సేల్, రిటేల్ వ్యాపారులు వంట నూనెల ధరలను పెంచేస్తున్నారు.ఈ క్రమంలో హోల్సేల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరను పెంచుతూ పోతున్నారు.మండలం అంతటా వంట నూనెల పరిస్థితి ఇలాగే ఉంది.
హోల్ సేల్ డీలర్లు సిండికేట్
గత నెలలో పామాయిల్ కిలో ప్యాకెట్ ధర రూ.130 ఉండగా ప్రస్తుతం రూ.140కి చేరింది. ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ గత నెలలో కిలో రూ.140 ఉండగా ప్రస్తుతం రూ.180 అయ్యింది. వేరుశగన (పల్లీ) నూనె గతంలో రూ.150 ఉండగా ప్రస్తుతం రూ.170కి చేరింది. హోల్సేల్ డీలర్లు సిండికేట్గా ఏర్పడి యుద్ధాన్ని సాకుగా చూపుతూ నూనెల ధరలు పెంచుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.వంట నూనెల ధరలు నియంత్రించాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో హోల్ సేల్ వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచు తున్నట్లు విమర్శలు ఉన్నాయి.ప్రస్తుతం శుభాకార్యాల సీజన్ కావడంతోవంట నూనె ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.అన్ని రకాల నూనెలు గత నెల కంటే రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగిపోయి కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి వంట నూనెల ధరలను తగ్గించాలని పలువురు కోరుతున్నారు.
ధరలు నియంత్రించాలి..
వంట నూనెల ధరలను నియంత్రించడానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ధరలను నియంత్రించే యంత్రాంగం ఉన్నా వ్యాపారులు ఇష్టానురీతిగా పెంచుతున్నారు. వంట నూనెల ధరలు సామాన్యులకు అందుబాటు లో ఉండేలా చూడాలి.రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వంట నూనెల ధరలు తగ్గించాలని కోరుతున్నారు.



