Wednesday, January 7, 2026
E-PAPER
Homeజాతీయంనీటి విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య సహకారం అవసరం

నీటి విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య సహకారం అవసరం

- Advertisement -

కాళేశ్వరానికి నేను అడ్డు చెప్పలేదు
నదుల అనుసంధానం జరగాలి : ప్రపంచ తెలుగు మహాసభల్లో ఏపీ సీఎం చంద్రబాబు

నవతెలంగాణ-అమరావతి బ్యూరో
నీటి విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య సహకారం అవసరమని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు శాశ్వతంగా పరిష్కారం కావాలన్నదే తన లక్ష్యమన్నారు. తెలుగువారు కలిసి ఉంటేనే తెలుగు జాతి పురోగతి సాధ్యమవుతుందని చెప్పారు. గుంటూరులోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో ఆంధ్ర సారస్వత పరిషత్‌ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సోమవారం ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తపాలాశాఖ రూపొందించిన ప్రత్యేక కవర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్‌ హయాంలో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. సాగర్‌ జలాలను ఉపయోగించుకునేలా ఎస్‌ఎల్‌బిసి, ఎస్‌ఆర్‌బీసీి కాలువలు తెచ్చామని, తన హయాంలో కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులు, గోదావరిపై అలీ సాగర్‌, దేవాదుల వంటి ఎత్తిపోతల పథకాలను చేపట్టామన్నారు.

పట్టిసీమతో గోదావరి నీటిని కృష్ణాకు తరలించినట్టు చెప్పారు. ప్రతియేటా గోదావరిలో 3 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతుందన్నారు. గతేడాది కృష్ణా, గోదావరి నదుల నుంచి సుమారు 6,282 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లినట్టు చెప్పారు. గోదావరిలో పుష్కలంగా ఉన్న నీళ్లను తెలంగాణ వాడుకున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అభ్యంతరం చెప్పలేదన్నారు. రాష్ట్రంలో నదులన్నింటినీ అనుసంధానించాలని చెప్పారు. మాతృభాషను పరిరక్షించుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పారు. దేశంలో వందల సంఖ్యలో భాషలు ఉన్నా ఆరు భాషలకు మాత్రమే ప్రాచీన భాష హోదా దక్కిందన్నారు. వీటిలో తెలుగు భాష ఉండటం గర్వకారణమని తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య 10 కోట్లకుపైగా ఉందని చెప్పారు. ఉద్యోగానికి ఇంగ్లీషు అవసరమని, జీవితానికి మాతృభాష అవసరమని అన్నారు. తెలుగు భాషను, సంస్కృతిని కాపాడుకోవాలన్నారు. నన్నయ్య నుంచి అష్టదిగ్గజాల వరకూ, గురజాడ నుంచి దాశరథి వరకూ ఎందరో మహానుభావులు తెలుగు భాషకు సేవ చేశారన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు, తెలుగు జాతి ఐక్యతకు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారన్నారు. మన ప్రాస, యాస, సంధులు, సమాసాలు, సామెతలు, పొడుపు కథలు అన్నీ మనకే ప్రత్యేకమని తెలిపారు. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు కీర్తించారని పేర్కొన్నారు.

సాంకేతికతతో భాషను కాపాడు కోవడం మరింత సులభతరం అవుతుం దని ముఖ్యమంత్రి తెలిపారు. హిందీ తరువాత ఎక్కువ రాష్ట్రాల్లో ప్రజలు మాట్లాడే భాష తెలుగని చెప్పారు. మాతృభాషలో రాణిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారని తెలిపారు. నాలెడ్జ్‌ ఎకానమీలో తెలుగువారు ముందుండాల న్నారు. దేశానికి యువతే ఒక గొప్ప వరమన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యే కళాకారులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వివిధ ఆలయాల్లో ఆస్థాన విద్వాంసులను, కవులను నియమించే విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులకు ఓడి సౌకర్యం కల్పిస్తామన్నారు. మాతృభాషాభివృద్ధికి, తెలుగు జాతి ఔన్నత్యానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.

గోవా గవర్నర్‌ పి అశోక్‌ గజపతిరాజు మాట్లాడుతూ.. తెలుగు భాష ఘన చరిత్రను భావితరాలకు అందించే విషయంలో కాస్త వైఫల్యం చెందినట్లు పేర్కొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. భావితరాలకు తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేయాలన్నారు. తెలుగు రచయితలు, కవులు, కళాకా రులను ప్రోత్సహించాలని చెప్పారు. శాసన సభాపతి సిహెచ్‌ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. తెలుగు పండగలను గ్రామాల్లో జరుపు కోవాలన్నారు. నాటకాలు, కళారూపాలను ప్రోత్స హించాలని, వీటిపై చిన్నారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీసు కంప్లైంట్‌ అథారిటీ ఛైర్మన్‌ కె శివశంకరరావు, ఎమ్మెల్యేలు బి రామాంజనేయులు, గళ్లా మాధవి, నజీర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -