చిన్నదైనా పెద్దదైనా, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. అయితే అవకాశం వచ్చినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకొని తిరిగి కొత్త జీవితం ప్రారంభించాలి. అప్పుడే జీవితంలో సంతోషంగా ఉండగలం. అలా కాకుండా పదే పదే తప్పులు చేస్తూ పోతే ఎవ్వరూ మనల్ని దగ్గరకు రానియ్యరు. జీవితంలో ఇక నమ్మరు. అలాంటి ఓ సమస్యే ఈ వారం ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో చూద్దాం…
లావణ్యకు సుమారు 38 ఏండ్లు ఉంటాయి. పెండ్లయి 15 ఏండ్లు అవుతుంది. భర్త ప్రదీప్‌కు తల్లిదండ్రులు లేరు. ఈ మధ్య కాలంలోనే తల్లి చనిపోయింది. ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. లావణ్య ఎనిమిది నెలల నుండి భర్తకు దూరంగా ఉంటుంది. పిల్లలు ప్రదీప్ దగ్గరే ఉంటున్నారు. ప్రదీప్ తల్లి చనిపోయినప్పుడు ఆమె వెళితే లోపలికి కూడా రానీయలేదు. పిల్లలతో కూడా మాట్లాడనీయలేదు. ‘నాపై అనుమానంతో నా భర్త ఇంటి నుండి పంపించేశాడు. నాకు నా భర్త, పిల్లలు కావాలి. ఎలాగైనా మీరే మాట్లాడి నన్నూ నా పిల్లలను కలపండి’ అంటూ తెలిసిన వాళ్లు ఎవరో చెబితే ఐద్వా అదాలత్‌కు వచ్చింది.
మేము ప్రదీప్‌ను పిలిపించి మాట్లాడితే ‘నా భార్యంటే నాకు ఇష్టం. అందుకే పెండ్లి చేసుకున్నాను. పెండ్లి తర్వాత 14 ఏండ్లు సంతోషంగా ఉన్నాము. మూడేండ్ల కిందట ఆమె వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఇది నా అనుమానం కాదు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాటి ద్వారా కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాను. త్వరలోనే ఆమె నుండి నాకు విడాకులు వస్తాయి. ఆ తర్వాత ఆమె జీవితం ఆమెది. తన ఇష్టం వచ్చినట్టు ఉండమనండి. నాకు ఇక ఎలాంటి సంబంధం లేదు. కానీ నాతో ఉంటూ వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే ఎలా భరిస్తాను? ఆ ప్రభావం నా పిల్లలపై పడుతుంది. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆమె ఇల్లు వదిలి వెళ్లి సుమారు ఎనిమిది నెలలు అవుతుంది. పిల్లలను నేనే చూసుకుంటున్నాను. ఉద్యోగం చేసుకొని వచ్చి పిల్లల్ని చూసుకోవడం ఇబ్బందిగానే ఉంది. కానీ ఎంత ఇబ్బంది అయినా పిల్లల్ని మాత్రం నేనే చూసుకుంటాను.
లావణ్య చేస్తున్న పనులు చూసి ఆమెను ఆపలేక, ఆ దిగులుతోనే మా అమ్మ చనిపోయింది. ఆమె చనిపోయి మూడు నెలలు అవుతుంది. అప్పుడు కూడా ఇంటికి వచ్చి గొడవ చేసింది. మా బస్తీలో నా పరువు పోయింది. ఆమె సంబంధం గురించి నాకే కాదు మా బస్తీ వాళ్లందరికీ తెలుసు. ఒక వేళ నా మాటలు మీరు నమ్మకపోతే మీరే వచ్చి మా ఏరియాలో కనుక్కోండి. ఆమె గురించి అందరూ ఏం చెప్తారో వినండి. ఒకసారి చేస్తే అది పొరపాటుగా భావించవచ్చు. కానీ పదే పదే ఇలాగే చేస్తే దాన్ని ఏమనాలి? ఇలాంటి పనులు చేయవద్దని నేను ఆమెకు ఎన్నో సార్లు చెప్పాను. కానీ నా మాట వినలేదు. అందుకే మేము ఉండే ఏరియా నుండి ఖాళీ చేసి మా అమ్మ దగ్గర వచ్చి ఉన్నాము. ఇక్కడకు వచ్చిన తర్వాతైనా ఆమెలో మార్పు వస్తుందనుకున్నాను. కానీ ఆమెలో ఏ మాత్రం మార్పు రాలేదు. పైగా ఆమె ప్రవర్తనతో మా అమ్మ ఆరోగ్యం పాడైపోయింది. చివరకు ఆ దిగులుతోనే చనిపోయింది. అంతెందుకు నేను చెబుతున్న దాంట్లో ఆబద్దం ఉంటే మీరు లావణ్యనే అడగండి’ అన్నాడు.
దానికి ఆమె ‘నేను వేరే వ్యక్తితో మాట్లాడిన మాట వాస్తవమే. కానీ నాకూ అతనికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం మాట్లాడితేనే సంబంధం అంటగడితే ఎలా? ఇంత చిన్న విషయానికి నా పిల్లలను నాకు దూరం చేస్తున్నాడు. నాకు నిజంగానే అతనితో సంబంధం ఉందని నిరూపిస్తే ప్రదీప్‌కు విడాకులు ఇస్తాను. అసలు నిజం చెప్పాలంటే నాకు కాదు వేరే వ్యక్తితో సంబంధం ఉంది. ప్రదీప్‌కే వేరే ఆమెతో సంబంధం ఉంది. అందుకే వాళ్ల తమ్ముడు, తల్లితో కలిసి నన్ను బయటకు గెంటేశారు’ అంది. దీనికి ప్రదీప్ ‘అది జరిగి పదేండ్లు అవుతుంది. నా నుండి అప్పట్లో పొరపాటు జరిగింది. దాన్ని నేను ఒప్పుకుంటాను. మళ్లీ ఎప్పుడూ నేను అలాంటి పొరపాటు చేయలేదు. కానీ లావణ్య అలా కాదు. ఒకటికి నాలుగు సార్లు నేను ఆమెను అతనితో చూశాను. అయినా ఇప్పుడు తిరిగి నాపైనే నిందలు వేస్తుంది’ అన్నాడు.
ఇద్దరి మాటలు విన్న తర్వాత మేము ‘సరే ఇప్పుడు ఆమె తను చేసిన తప్పు తెలుసుకుంది. అందుకే భర్తా, పిల్లలు కావాలని వచ్చింది. ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది కదా! మేము ఆమెతో మాట్లాడి నచ్చజెబుతాం. మరో సారి ఇలాంటి తప్పు చేయవద్దని చెబుతాం. ఒక్క అవకాశం ఇస్తే మంచిదని మా ఆలోచన. అయినా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పూ లేకపోతే అప్పుడు నీకు నచ్చినట్టు నువ్వ చేసుకో’ అని అతనికి చెప్పాము. కానీ అతను దీనికి ఒప్పుకోలేదు. పైగా ‘కావాలంటే నాపై కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టించండి. అంతే కానీ ఆమెతో కలిసి ఉండమని మాత్రం చెప్పకండి. ఈ విషయంలో నన్ను బలవంతం చేయకండి. నేనే కాదు పిల్లలు కూడా ఆమెను వద్దంటున్నారు.
ఆమెను వాళ్లు నమ్మడం లేదు. కావాలంటే మీరే పిల్లల్ని అడగండి’ అన్నాడు. ఏది ఏమైనా ప్రదీప్ కోర్టుకు వెళతాననే అంటున్నాడు. కానీ లావణ్య మాత్రం భర్తా, పిల్లలు కావాలంటుంది. ఇక చేసేది లేక ఆమెను కూడా కోర్టుకు వెళ్లమని చెప్పాము. మనుషులు ఎవరైనా పొరపాట్లు, తప్పులు చేయడం సహజం. కానీ అవకాశం వచ్చినప్పుడు వాటిని సరిదిద్దుకోవాలి. మరోసారి అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి. కానీ మళ్లీ మళ్లీ చేస్తే ఎవ్వరూ క్షమించరు. మరీ ముఖ్యంగా భార్యా భర్తల మధ్య ఇలాంటివి జరిగితే చాలా కష్టం. అప్పుడు ఇలాంటి సమస్యలే వస్తాయి. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మనం చేసింది పొరపాటు అయినా, తప్పు అయినా సరిదిద్దుకొని మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి.
- వై వరలక్ష్మి,
9948794051



