నవతెలంగాణ – అశ్వారావుపేట
రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావును గండుగులపల్లిలోని వారి నివాసంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల అశ్వారావుపేట నూతన మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన కౌన్సిలర్ల ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు పరిచయం చేశారు. ప్రజల ఆశీస్సులతో గెలుపొందిన కౌన్సిలర్ లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సూచించారు.
ముఖ్యంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి, మంచినీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు, ఆత్మ (బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, తుమ్మ రాంబాబు, చిన్నం శెట్టి సత్యనారాయణ, కాసాని పద్మశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



