Saturday, December 20, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు19 జిల్లాల్లో 91 మంది సీపీఐ(ఎం) సర్పంచుల గెలుపు

19 జిల్లాల్లో 91 మంది సీపీఐ(ఎం) సర్పంచుల గెలుపు

- Advertisement -

ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు
వామపక్ష పార్టీల సర్పంచులకు అభినందనలు
124 ఉపసర్పంచులు, 1300కుపైగా వార్డులు కైవసం
ప్రజల్లో ఉంటూ ఆదర్శపాలన అందించండి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తమ పార్టీ తరఫున 19 జిల్లాల్లో 91 మంది సర్పంచులు గెలుపొందారనీ, 124 గ్రామాల్లో ఉపసర్పంచి స్థానాలను దక్కించుకోవడంతో పాటు రాష్ట్రంలో 1300కిపైగా వార్డుల్లో విజయం సాధించారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రకటించారు. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తమ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీతో పాటు ఇతర వామపక్షాల తరఫున గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లకు అభినందనలు తెలిపారు. ప్రజా పోరాటాలకు అండగా ఉంటున్న వామపక్ష పార్టీల అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో గెలిపించడం మంచి పరిణామం అని పేర్కొన్నారు.

గెలిచిన అభ్యర్థులు ప్రజలకు అండగా ఉంటూ ఆదర్శ పాలన అందించాలని ఆకాంక్షించారు. డబ్బులు, ప్రలోభాలకు గురికాకుండా కమ్యూనిస్టులను ప్రజలు ఆదరించిన చోట వారి నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. ‘ఈ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో డబ్బు, మద్యం, రకరకాల ప్రలోభాలు పనిచేసినట్టు, కొందరు లక్షలాది, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినట్టు వార్తలు రావడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ నిరంతరం పోరాడే కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులకు ప్రజలు పట్టం గట్టడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో సొంతంగా, మరికొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లతో పరస్పర సర్దుబాటుతో తమ పార్టీ అభ్యర్థులు గెలిచారని తెలిపారు.

సీపీఐ(ఎం) అత్యంత బలంగా ఉన్న గ్రామాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ఒక్కటై ఓడించే ప్రయత్నం చేసినప్పటికీ డబ్బు, మద్యం, రకరకాల ప్రలోభాలను ఎదుర్కొంటూ విజయం సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు చాలా చోట్ల లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి ప్రజల తరఫున పోరాడేవారిని ఓడించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు గురికాకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఓటేసేలా చైతన్యపర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజల కోసం ఉద్యమాల ద్వారా నిరంతరం పనిచేస్తూ, వామపక్షాల బలం పెంచేందుకు ప్రయత్నం చేయాల్సిన అవశ్యకత ఉందనీ, ఆ దిశగా ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -