చంఢగీడ్‌లో ఐదు రోజుల కార్యక్రమాలు
900 మంది ప్రతినిధులు హాజరు
చంఢగీడ్ : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 25వ జాతీయ మహాసభ ఆదివారం చంఢగీడ్‌లో ప్రారంభమయింది. ఇక్కడ కిసాన్ భవన్, సెక్టార్ 35లో ఐదు రోజుల పాటు జరిగే ఈ మహాసభలో దేశం నలుమూల నుంచి దాదాపు 900 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఆదివారం మోహాలిలోని సబ్జి మండి గ్రౌండ్‌లో జరిగిన భారీ ర్యాలీతో ఈ మహాసభ ప్రారంభమయింది. ఈ ర్యాలీలో వేలాది మంది రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ కార్యదర్శి అమర్‌జీత్ కౌర్, పంజాబ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంట్ సింగ్ బ్రార్, ట్రేడ్ యూనియన్ నాయకులు నిర్మల్ సింగ్ ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, విభజన విధానాలను విమర్శించారు. యువతకు ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న పంజాబ్, జమ్మూకాశ్మీర్ వంటి రాష్ట్రాలకు తగినంత సాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఇక సోమవారం కిసాన్ భవన్‌లో ప్రారంభ సమావేశం జరగనుంది. షహీద్ భగత్ సింగ్ మేనల్లుడు ప్రొఫెసర్ జగ్మోహన్ సింగ్ జెండా ఎగురవేయడంతో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో డి.రాజాతో పాటు ఇతర పార్టీ జాతీయ నాయకులు ప్రసంగిస్తారు. అలాగే సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, ఆర్‌ఎస్‌పీ నాయకులు దీపాంకర్ భట్టాచార్య, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు జి.దేవరాజన్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు మనోజ్ భట్టాచార్య కూడా ప్రసంగించనున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకూ జరిగే చర్చలు, ప్రతినిధుల సమావేశాల్లో రాజకీయ, సామాజిక అంశాలపై దృష్టి పెడతారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలు, పంజాబ్‌లో వరద సంక్షోభం వంటి అంశాలతో పాటు సంతాప తీర్మానాలు, రాజకీయ నివేదికలు, సంస్థాగత విషయాలపై చర్చలు జరుగుతాయి. ఈ నెల 25న సెంట్రల్ కంట్రోల్ కమిషన్, నేషనల్ కౌన్సిల్, నేషనల్ ఎగిక్యూటివ్, నేషనల్ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ, జాతీయ కార్యవర్గం ఎన్నికలు జరుగుతాయి. మాజీ ప్రధాన కార్యదర్శి ఎబి బర్ధన్ శత జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తీర్మానం ఆమోదిస్తారు. మహాసభ ప్రతీరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రముఖ కళాకారుల ప్రదర్శనలతో పాటు ప్రజా సమస్యలపై వివిధ నాటక బృందాలు ప్రదర్శనలు ఇస్తాయి. ‘ఈ మహాసభ దేశవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులకు కూడా ఒక మైలురాయి అవుతుంది’ అని సీపీఐ నాయకులు తెలిపారు.