Saturday, April 11, 2026
E-PAPER
Homeమానవిపిల్లల మ‌నోఫ‌ల‌కంపై సృజ‌న‌

పిల్లల మ‌నోఫ‌ల‌కంపై సృజ‌న‌

- Advertisement -

చదువు ఒక్కటే చాలదు జీవితంలో స్థిరపడాలంటే.. కొన్ని నైపుణ్యాలను అలవర్చుకోవాలని అంటారామె. డ్రాయింగ్‌, పెయింటింగ్‌, కంప్యూటర్‌, వస్తువుల తయారీ.. ఇలా ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన అంశంలో ప్రాథమిక స్థాయి నుంచే నిపుణత ప్రదర్శించాలని ప్రోత్సహిస్తారు. సబ్జెక్టు అంశాలకు వీటిని అదనంగా జోడిస్తే నిపుణత వస్తుందని అంటారామె. జాతీయస్థాయి ఆర్టిస్ట్‌గానూ గుర్తింపు పొందారు. ఆమే మాదాబత్తుల తిరుమల శ్రీదేవి. పిల్లల మనోఫలకంపై చదువుతోపాటు సంస్కారాన్ని ఉన్నతంగా లిఖించేలా బోధిస్తూ భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

తిరుమల శ్రీదేవి… విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం భీమునిపట్నంలోని పండిట్‌ నెహ్రూ జీవీఎంసీ మున్సిపల్‌ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. విద్యాబోధనలో, పాఠశాల నిర్వహణలో సరికొత్త పద్ధతులు అవలంభిస్తూ ముందుకు సాగుతున్నారు. 2001లో స్కూల్‌ అసిస్టెంట్‌ (హైస్కూల్‌ టీచర్‌)గా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించి జీవశాస్త్రంలో బోధన ప్రారంభించారు. గతంలో విశాఖపట్నంలోని ఎంవీడీఎం, కేడీపీఎం ఉన్నత పాఠశాలల్లో పనిచేశారు. 2021లో ప్రధానోపాధ్యాయురాలిగా ఉద్యోగోన్నతి పొందారు. గతంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఉత్తమ ఉపాధ్యాయినిగా అవార్డులు సైతం అందుకున్నారు. ఆర్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ విధానంలో విద్యార్థులకు బోధన కొనసాగించారు. డిజిటల్‌ బోర్డు వినియోగంతోపాటు ఆయా పాఠ్యాంశాలను ప్రాక్టికల్‌గా వివరిస్తూ విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా చేస్తున్నారు. విద్యార్థులను క్షేత్రస్థాయి పర్యటనలకు తీసుకెళ్లి ప్రాజెక్టులు చేయిస్తుంటారు. ఇది ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది.

సరికొత్త రూపకల్పనలు
సింగిల్‌-యూజ్‌ ప్లాస్టిక్‌ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు శ్రీదేవి. ‘కమ్‌ టు లెర్న్‌-అండ్‌ గో టు సర్వ్‌ ది నేషన్‌’ (చదువుకునేందుకు రండి-దేశ సేవకు వెళ్లండి) థీమ్‌తో శ్రీదేవి ప్రవేశపెట్టిన నూతన విధానానికి జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. వెల్త్‌ ఫ్రొం వేస్ట్‌ కాన్సెప్ట్‌లో భాగంగా పాడైపోయిన గడియారంతో పర్యావరణ సందేశాలు అద్భుతాలు తయారుచేసి పెడుతున్నారు. పనికిరాని వస్తువులను సేకరించి వాటికి అర్థం వచ్చేలా సరికొత్త రూపకల్పనలు చేస్తున్నారు. ఫ్యాషన్‌ టెక్నాలజీలో భాగంగా దుస్తులపై బ్లాక్‌ ప్రింటింగ్‌ పెయింటింగ్‌ నేర్పించారు. పిల్లలతో ముడిసరుకులు తెప్పించి సబ్బుల తయారీకి ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కృషి ఫలితాన్నిచ్చి 2025లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యేలా చేసింది.

డిజిటల్‌ బోధనతో
విద్యలో వెనుకబడి ఉన్నామనే భావన వద్దనీ, నిదానంగా, కాస్త శ్రద్ధగా, ఓపిగ్గా చదివితే సున్నా నుంచి ఉన్నత స్థాయికి, వెళ్లచ్చునని ఆమె నూరిపోస్తుంటారు. దానికోసం అనేక రకాల ప్రాజెక్టులు చేయిస్తారు. వ్యక్తిగతంగానూ, జట్టుకృత్యాలను చేయిస్తుంటారు. ఇలాంటి కాన్సెప్ట్స్‌ వల్ల విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందనీ, వారిలో మంచి ఆలోచన విధానం పెరుగుతుందని, ప్రతిభను వెలికితీసేందుకు ఉపకరిస్తుందని అంటారు. డిజిటల్‌ బోధనతో విద్యార్థులకు చదువుపై మక్కువ పెంచేలా ఆమె ఎంచుకున్న వినూత్న పద్ధతులు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. పుస్తకంలోని పాఠాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా కార్డ్‌బోర్డు గేమ్స్‌, సైన్స్‌ డ్రామా, క్విజ్‌ వంటివి ఆడిస్తున్నారు. విద్యార్థులలో లీడర్షిప్‌ క్వాలిటీస్‌ పెంచేందుకు స్కూల్‌ పీపుల్‌ లీడర్‌ ఎలక్షన్స్‌ కండక్ట్‌ చేస్తున్నారు. వివిధ సామాజిక అంశాలపై అల్‌ ఇండియా రేడియో, వివిధ టీవీ మధ్యమాలలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.

స్కిల్‌ ఓరియెంటెడ్‌ ప్రాజెక్ట్స్‌
శ్రీదేవి తన పాఠశాల పరిధిలోని పిల్లలంతా ఏదో ఒక నైపుణ్యంతో ముందుకు సాగాలని నిరంతరం ప్రయత్నిస్తుంటారు. స్కిల్‌ ఓరియెంటెడ్‌ ప్రాజెక్ట్స్‌ని ప్రోత్సహిస్తుంటారు. భవిష్యత్తులో ఎవరైనా సొంతకాళ్లపై నిలబడాలనుకునే వారికోసం సబ్బుల తయారీలో శిక్షణ ఇస్తున్నారు. పిల్లలే తయారుచేసి తాము వాడుతూనే ఇంట్లో తల్లిదండ్రులు సైతం వీటినే వాడేలా చూస్తున్నారు. ఈ పిల్లల ప్రతిభ చూసిన అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం శభాష్‌ అంటూ ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.

ప్రత్యేక గుర్తింపు
ఆధునిక విద్యాబోధనలో భాగంగా పాఠ్యాంశాలను ప్రాక్టికల్‌గా వివరిస్తూ, విద్యార్థులతో పలు అంశాలపై ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయిస్తారు శ్రీదేవి. దీనివల్ల పాఠ్యాంశాలు బాగా అర్థమై విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. 2015లో 8వ తరగతి విద్యార్థులు వర్షం నీటితో భూగర్భ జలాలను ఎలా పెంచాలనే అంశంపై రూపొందించిన ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో ఐదో స్థానం లభించింది. గూగుల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌లో ప్రత్యేక గుర్తింపు లభించింది. వినూత్న పద్ధతుల్లో బోధన, దాని ఫలితాలు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఆమెను రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపిక చేసింది. 2025లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరాన్ని పురస్కరించుకుని గత కొన్నిరోజులుగా డ్రాపౌట్స్‌ను నివారించేందుకుగాను అవసరమైన కృషిని ప్రారంభించారు.
– యడవల్లి శ్రీనివాసరావు.

ఒత్తిడి రహిత బోధన
టెక్నాలజీ హెల్ప్స్‌ మీ ఇన్‌ మేకింగ్‌ ఎడ్యుకేషన్‌ ఇంక్లూసీవ్‌, ఇట్‌ మేక్స్‌ టీచింగ్‌ సింపులర్‌ ఫర్‌ టీచర్స్‌ అండ్‌ లెర్నింగ్‌ మోర్‌ ఫన్‌ ఫర్‌ స్టూడెంట్స్‌… ఒత్తిడి రహితమైన విద్యే లక్ష్యం. ఆడుతూ, పాడుతూ జారు ఫుల్‌ పద్ధతుల్లో బోధిస్తే విద్యార్థుల మనోఫలకంపై చెరగని ముద్ర వేయగలం. ఒత్తిడి రహిత బోధన సాగిస్తున్నాం. డిజిటల్‌ పద్ధతులు పాటిస్తున్నాం. ఇలా బోధించడం ద్వారా పిల్లల్లో మంచి ఆలోచన విధానం ఏర్పడటంతోపాటు ప్రతిభ కూడా తెలుస్తుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం కాకుండా భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతున్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఒక విద్యార్థి, ఒక పుస్తకం, ఒక పెన్‌, ఒక టీచర్‌ సమాజంలో మార్పుని తీసుకురాగలరని విశ్వాసిస్తున్నాను.
మాదాబత్తుల తిరుమల శ్రీదేవి,

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -