Monday, December 29, 2025
E-PAPER
Homeదర్వాజఆడంబరం లేని పదాలలో సృజనాత్మక శక్తి వినోద్‌ కుమార్‌ శుక్లా

ఆడంబరం లేని పదాలలో సృజనాత్మక శక్తి వినోద్‌ కుమార్‌ శుక్లా

- Advertisement -

నివాళి

హిందీ సాహిత్య ప్రపంచంలో సాధారణ మనిషి జీవితాన్ని అసాధారణ సున్నితత్వంతో చిత్రించిన అరుదైన కవులు రచయితల్లో వినోద్‌ కుమార్‌ శుక్లా ఒకరు. కవిగా, నవలా రచయితగా ఆయన తన రచనల ద్వారా రోజువారీ జీవితంలోని చిన్న సంఘటనలకు, సాధారణ అనుభవాలకు గాఢమైన కవిత్వ గౌరవాన్ని అందించారు. మనిషుల్లోని భావోద్వేగాల లోతును, మానవీయ మౌనాన్ని ఆడంబరం లేని పదాలతో వ్యక్తపరచగల సృజనాత్మక శక్తి ఆయన రచనల ప్రత్యేకత.

1937 జనవరి 1న ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందగావ్‌లో జన్మించిన వినోద్‌ కుమార్‌ శుక్లా జబల్‌పూర్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయం (JNKVV) నుంచి వ్యవసాయ శాస్త్రంలో ఎం.ఎస్‌సి పూర్తి చేశారు. చదువు తర్వాత రాయ్ పూర్‌ వ్యవసాయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఈ విద్యా ఉద్యోగ నేపథ్యం ఆయన రచనల్లో కనిపించే క్రమశిక్షణ, సున్నితమైన పరిశీలనలకు బలమైన పునాది అయింది. కవిగా వినోద్‌ కుమార్‌ శుక్లాపై గజానన్‌ మాధవ్‌ ముక్తిబోధ్‌ ప్రభావం కనిపిస్తుంది. అయితే ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గొంతుని, స్వీయ రచనా మార్గాన్ని నిర్మించుకున్నారు. ‘మ్యాజికల్‌ రియలిజం’ శైలిలో ఆయన రచనలు సాగుతాయి ఆయన రచనల్లో కల్పన, వాస్తవం పరస్పరం కలిసి మెలిసి, సాధారణ జీవితంలోని భావోద్వేగ గంభీరతను, మానవ గౌరవాన్ని ఆవిష్కరిస్తాయి.

వినోద్‌ కుమార్‌ శుక్లా 2025 డిసెంబర్‌ 23న రాయ్ పూర్‌లోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వినోద్‌ కుమార్‌ శుక్లా మరణంతో సాహిత్య ప్రపంచం ఒక అసాధారణ రచయితను కోల్పోయింది. శుక్లా హిందీలో ఒక ముఖ్యమయిన కవి, ప్రధాన నవలా రచయిత. ఆయన రచనల కేంద్రబిందువు సాధారణ మనుషుల బతుకు. శుక్లా ‘సాధారణంలో అసాధారణాన్ని దర్శించే కవి’. నిజాన్ని దాని సరిహద్దుల వరకూ నెట్టి, దాన్ని సరికొత్త వాస్తవికతగా మారే దశకు చేరేలా చేసే కల్పన ఆయనది. ఆయన కవిత్వంలో కథన ఛాయలుంటాయి. ఆయన కథాసాహిత్యంలో కవిత్వపు ప్రతిధ్వనులు వినిపిస్తాయి. హిందీ భాషా ప్రాంతపు అంచుల్లో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్ పూర్‌లోనే తన జీవితం, సాహిత్య ప్రయాణాన్ని ప్రధానంగా గడిపారు. హిందీ సాహిత్య ప్రపంచంలోని వాదవివాదాలు, సిద్ధాంతపోరాటాల నుంచి ఆయన దూరంగా ఉన్నారు.

తాను ఏ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నానో నిర్వచించడానికీ, ప్రకటించడానికీ ఆయన నిరాకరించారు. ఆయన జీవితం, సృజనాత్మక కృషి దాదాపు పూర్తిగా జీవితం, సాహిత్యానికే అంకితమయ్యాయి. ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో బోధన చేస్తూ జీవనం సాగించారు. మొత్తంగా ఒక సాహిత్య తపస్విలా జీవించారు. 1960ల చివర్లో హిందీ కవిగా వినోద్‌ సంప్రదాయానికి భిన్నమైన కవిత్వ భాషతో, సామాజిక దృష్టితో గుర్తింపబడింది. హిందీ భాషా వ్యాకరణంలోని సాంప్రదాయ పరమయిన సింటాక్స్‌ నుంచి ఆయన నిర్భయంగా మరలి వెళ్లిపోయారు. సిద్ధాంతాలు, విశ్వాసాలు అచంచల సత్యాల్లా నిలిచిన ఆనాటి కాలంలో, శుక్ల ఆకర్షణీయమైన అనిశ్చితితో కనిపిస్తూనే విశ్వాసం లేనివాడిగా ముందుకొచ్చాడు. వ్యాకరణాన్ని తోసిరాజని ఆయన తన కల్పనకు కొత్త సింటాక్స్‌ను సృష్టించాడు.

వినోద్‌ కుమార్‌ శుక్లా తొలి కవితా సంపుటి లగ్‌భగ్‌ జైహింద్‌ (దాదాపు జైహింద్‌). 1970లో వెలువడింది మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆరంభించిన ముక్తిబోధ్‌ ఫెలోషిప్‌ కింద ఆయన రాసిన తొలి నవల నౌకర్‌ కీ కమీజ్‌ (ఉద్యోగి చొక్కా) 1979లో ప్రచురితమైంది. సుమారు 1980లో ఆయన కవిత్వానికి రజా పురస్కారాన్ని తన తొలి అవార్డుగా అందుకున్నారు. చాలా కాలం తర్వాత 1999లో మణి కౌల్‌ ‘నౌకర్‌ కి kameej నవల’ను ఒక విశిష్టమైన సినిమాగా రూపొందించారు. ఆయన తొలి హార్డ్‌ బౌండ్‌ కవితా సంపుటికి వహ్‌ ఆదమీ చలా గయా నయా గరమ్‌ కోట్‌ పహిన్‌కర్‌ విచార్‌ కీ తరహ్‌ (ఒక ఆలోచనలా కొత్త వెచ్చని కోటు వేసుకుని ఆ మనిషి వెళ్లిపోయాడు). అనే పేరు పెట్టారు.

అర శతాబ్దానికి పైగా సాగిన తన రచనా జీవితంలో, వినోద్‌ కుమార్‌ శుక్లా పాఠకుల్లో ఆదరణ పొందడమే కాక, విమర్శకుల దృష్టినీ ఆకర్షించాడు. ఆయన రచనలు అనేక భారతీయ, విదేశీ భాషలలోకి అనువదించబడ్డాయి. కొన్ని నాటకాలు, సినిమాలుగా మారాయి. ఆయన సంకోచ స్వభావం గలవాడు, వినయశీలి, చివరంటా ఆశలేని వ్యక్తిగానే నిలబడ్డారు. కుటుంబం, ఇంటి పట్ల అంకితభావంతో కాలం గడిపారు. తన రచనల గురించి ఎన్నడూ పెద్ద పెద్ద ప్రకటనలు ప్రచారాలు చేయని వ్యక్తి. ఒక దశలో హిందీలోని వామపక్ష సాహిత్య ప్రపంచం ఆయనను తోసిపుచ్చినా, అనేక మంది విమర్శకులు, రచయితలు ఆయన రచనలను మెచ్చుకున్నారు. ఆయనను అందచందాలకే పరిమితమైనవాడు, శైలికే ప్రాధాన్యం ఇచ్చేవాడు, శ్రమజీవుల పట్ల నిర్లక్ష్యుడు అని కూడా కొందరు విమర్శించారు. వారిని సంతృప్తిపరచడానికి శుక్లా ఎప్పుడూ ప్రయత్నించలేదు. తన దారిలో తాను దాదాపు ఒంటరిగా నడుచుకుంటూ రాస్తూనే ఉండిపోయాడు.

శుక్లా కవితల లోకంలో తామర పూలు చెరువు నీటిని ముడివేస్తాయి, రంగోళీలు రెక్కలు చాచుకుని ఎగురుతాయి, చిలుకలు చెట్లలో కలిసిపోతాయి, కొత్త ఉన్ని కోటు వేసుకున్న మనిషి ఒక ఆలోచనలా నడిచిపోతాడు. అస్తిత్వం ఎంతగా జారిపోతుందో, ఎంతగా అందుకోలేనిదో దాన్ని ఆయన కవిత్వం సున్నితంగా పట్టుకుంటుంది. ఆయన కవిత్వం జీవితంలోని చిన్న చిన్న క్షణాలే పెద్ద సత్యాలను వెల్లడించేలా చేస్తుంది. తన రచనల్లో జీవితంలోని అనేక లోతైన ప్రశ్నలను గురించి ఆలోచిస్తాడు. కాలానికి శబ్దం ఏంటి? ప్రేమకు వాసన ఉందా? అంటూ జీవితంపై ఆయన చేసే ఆలోచనలు ఎంతో లోతైనవిగా ఉంటాయి కాబట్టి, వాటిని వ్యక్తపరచే వాక్య నిర్మాణం సాంప్రదాయ వ్యాకరణాన్ని సవాలు చేస్తుంది.

ఒక కవితలో ఆయన ఇలా రాస్తాడు: ”ఆ తరువాతే ఇప్పుడు వస్తుంది.” క్షణం క్షణంగా వెలిసే అంతర్ముఖ అనుభవాలను పట్టుకుని, అత్యంత సాధారణ దశ్యాల్లోనే అర్థాన్ని కనుగొంటుంది ఆయన కవిత్వం. ఉదాహరణగా చెప్పుకుంటే ‘రొట్టె ముక్క పట్టుకున్న కాకి ఒకటి ఆకలి, కోరికలపై ధ్యానానికి దారి తీస్తుంది, ఆ కాకి తన వాటా దక్కించుకుంటే, మనిషికి ఎందుకు దక్కకూడదు? అని ప్రశ్నిస్తుంది. శుక్లా రాజకీయ దక్కోణాలు కూడా రోజువారీ అన్యాయాల పట్ల ఆయన సున్నితమైన స్పందనలోనుంచే పుట్టాయి. నిర్లక్ష్యానికి బలైన నిరాశ్రయ ఆదివాసీల జీవితాలు, జీవితంలోని అర్థరాహిత్యాల ఎదుట ఎదురు నిలవలేని చిన్నమనుషుల పోరాటాలు ఇవన్నీ ఆయన కవితల్లో వినిపిస్తాయి. ఆ అస్తవ్యస్తతకు స్వరం ఇచ్చి, దానిపై ఒక క్రమాన్ని విధించేది కూడా ఆయన కవిత్వమే.

ఒక దశలో ముఖ్యంగా యువతకోసం, పిల్లల కోసం రాయడానికీ ఆయన మొగ్గుచూపారు. ఆ రచనల్లో ఆయన కల్పనకు హద్దులు లేకుండా పోయింది. వాస్తవం- కల్పితం రెంటి నడుమా తేడాని తొలగించాడు. జీవితం గానీ, సృజనాత్మకత గానీ కల్పన లేకుండా గ్రహించలేమని ఆయన అంతర్లీనంగా విశ్వసించాడు. దిగువ మధ్యతరగతి జీవితం, జీవన వాస్తవాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగిన వినోద్‌ శుక్లా తరువాత ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసీల బలవంతపు వలసలను, ఇల్లు వంటగదులను కోల్పోవడాన్ని ప్రశ్నించారు. ఆయన చివరి దశ కవిత్వం మన కాలంలోని ఈ ప్రత్యేక మానవ వేదన, అవమానాల పట్ల విస్తృతమైన, కదిలించే అనుకంపతో నిండిపోయింది. ఆయన అనుకంప, కల్పనల భౌగోళిక పరిధి గణనీయంగా విస్తరించింది. ఆడంబరం వైభవమూ వాటి ప్రభావాల పట్ల ఆయనకు సహజంగా ఉన్న అవిశ్వాసం మరింత లోతుగా మారింది. గిరిజనుల, నిరుపేదల అంతులేని బాధలో దాగి ఉన్న గౌరవం, మహత్యాన్ని హద్దులేని వెలుగును ఆయన తన సృజనలో స్పష్టంగా ఆవిష్కరించాడు.

ఈ సంవత్సరం వినోద్‌ కుమార్‌ శుక్లాకు 59వ జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న తొలి రచయితగా ఆయన చరిత్ర సృష్టించారు. గతంలో ఆయనకు దీవార్‌ మే ఏక్‌ ఖిడ్కీ రహ్తీ థీ నవలకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అంతేకాదు, అంతర్జాతీయ సాహిత్యంలో సాధనకు గుర్తింపుగా PEN / నబోకోవ్‌ అవార్డు పొందిన తొలి భారతీయ రచయితగా కూడా ఆయన నిలిచారు. శిఖర్‌ సమ్మాన్‌, రాష్ట్రీయ హిందీ గౌరవ సమ్మాన్‌, మైథిలీశరణ్‌ గుప్త సమ్మాన్‌, గజానన్‌ మాధవ్‌ ముక్తిబోధ్‌ ఫెలోషిప్‌, రాజా అవార్డు, మాతృభూమి బుక్‌ ఆఫ్‌ ది ఇయర్‌ వంటి అనేక గౌరవాలు ఆయనను వరించాయి. అయితే ఇప్పుడు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, సాధారణ మనిషి జీవితానికి కవిత్వపు వెలుగును ప్రసాదించిన ఆయన రచనలు భారతీయ సాహిత్యంలో చిరకాలం నిలిచిపోతాయి. వినోద్‌ కుమార్‌ శుక్లా సాహిత్యం మౌనంగా మాట్లాడే జీవితం, మెల్లగా మనసును తాకే కవిత్వం’ అని చెప్పుకోవచ్చు.

  • వారాల ఆనంద్‌, 9440501281
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -