Sunday, November 2, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిస్వసుఖం కోరని సృజనకారులు

స్వసుఖం కోరని సృజనకారులు

- Advertisement -

‘స్వసుఖం కోరని వాడు/ వారం వారం మారని వాడు/ రంగులు అద్దుకోలేని వాడు/ అబద్ధాసురుని పాలిట తల్వార్‌ ఆళ్వార్‌’ అని అగ్నిధారను వట్టికోట ఆళ్వారుస్వామికి అంకితం ఇస్తూ దాశరథి అన్న మాటలివి. నేడు ఈ ఇద్దరు సాహితీ ద్రష్టలగూర్చి ప్రస్తావించుకోవడం సందర్భంగానూ, అవసరంగానూ ఉన్నది. శనివారం వట్టికోట జయంతి, బుధవారం దాశరథి వర్థంతి. వారు ఇరువురు దేనిపైనైతే కలానికి కర్రుకట్టి సాహితీసేద్యం చేశారో ఆ సమస్యలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. శ్రమదోపిడీతో అశేషసామాన్య ప్రజలను బాధలకు గురిచేస్తున్న వ్యవస్థను తమతమ రచనలతో ఎండగట్టిన సృజన ద్వయం వీరిది.

వీరిద్దరూ ఇందూరు జైలులో మూడు నెలలు ఉన్నారు. ఆ సమయంలో నిజాం పాలనను నిరసిస్తూ దాశరథి జైలుగోడలపై రాసిన పద్యాలను వట్టికోట కంఠస్తం చేసి అందరికి వినిపించేవారు. అందుకు కృతజ్ఞతగా దాశరథి తన ‘అగ్నిధార’ కావ్యాన్ని ఆళ్వారుస్వామికి అంకిత మిచ్చారు. తన జైలుజీవితాన్ని, సొంత అనుభవాలను, ఖైదీల విభిన్న మనస్తత్వాలను తెలుపుతూ ‘జైలులోపల’ అనే పుస్తకం రాశారు. ఆళ్వారుస్వామి తెలంగాణ ప్రజాజీవితాన్ని నవలీకరించాలనే ‘ప్రజల మనిషి’ నవల తరువాత ఆయన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాన్ని తెలుపుతూ ‘గంగు’ నవలను రాశారు. అది మధ్యలోనే ఆగిపోయింది. అయితే దాన్ని అక్కడితో ముగించడం మంచిది అనే దాశరథి రంగాచార్య సూచన. యాదృచ్ఛికంగా ఆ నవల అక్కడితో ఆగిపోయింది. సామాన్యుడి జీవితాన్ని సాహితీ పీఠం ఎక్కించిన సాహితీ ద్రష్టలు వీరు.

తెలుగు కవిత్వంలో దాశరథి ముద్ర అజరామరమైంది. ఎవరివైపు నిలబడి కవిత్వం రాయాలన్నదానిపై ఆయనకు పూర్తి స్పష్టత ఉంది. ‘లేదు లేదు చల్లారగా లేదు పేదదాని గుండియలోని శ్మశాన వహ్ని.. కాల్చివేయును, బంగారు గద్దెలెక్కి పేదలను సిగరెట్లుగా పీల్చువారి, ఊరి ఊరి పొలిమేరలు మారీ.. దేశ దేశ సహవాసం కోరీ.. జాతిమతాలను పాతరవేసీ.., పచ్చనోట్లతో కొందరు.. కత్తిపోట్లతో కొందరు.. ప్రజల వోట్ల విలువను.. పడగొట్టాలని చూస్తున్నారు, వెనక్కిపోతూ.. ముందుకు పోతున్నామ నుకునే.. వెర్రి వెంగళాయల.. ‘విజ్ఞాన జ్యోతులు.. అజ్ఞానపు రీతులు..’ వంటి పంక్తులు అందుకు చక్కని ఉదాహరణలు. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల సాహిత్యాల్లో గొప్ప కవిత్వ మెలకువలు ఎరిగిన లాక్షణికుడు దాశరథి. అందుకే, దాశరథి కవిత్వానికి ప్రాసంగికత ఎప్పటికీ ఉంటుంది.
వట్టికోట మార్గంలో నడవటం చాలా కష్టమైనపని, ఆయన బాట కష్టాల బాట. జైలుగోడల మీద రుద్రవీణలు మోగించే దారి. ఆయన నిబద్ధత, నిమగతతో పుస్తకాలను నెత్తిన పెట్టుకొని మోశాడు, ఊరూరా తిరిగి పుస్తకాలను పంచుకుంటూ భావజాల వ్యాప్తి చేసిన వాడు. ఎవరి తిండి వారు తినొచ్చు అంటూ తెలుగు సాహిత్యంలో ఎద్దు మాంసంపై చర్చ లేవనెత్తిన సామాజిక స్పఅహ కలిగిన రచయిత వట్టి కోట. దళితుల దుర్భరస్థితికి అద్దంపట్టే కాపీర్లు వంటి కథ ఆరోజుల్లోనే ఆయన రాశారు. వట్టికోట ప్రజాసాహిత్యం కోసం మొత్తం తన జీవి తాన్నే వెచ్చించాడు. వంటవాడిగా జీవిస్తూ సాహిత్యాన్ని ప్రజలకు వండి పెట్టాడు. ఊరూరా తిరుగుతూ చివరకు హోటల్‌లో పనిచేస్తూ చదువుకున్నాడు. తాను చదువుకున్న చదువుతో తన రచనలతో సమాజానికి పాఠ్యాంశంగా మారాడు. అందుకే, వట్టికోట లాంటి వైతాళికులను, దార్శనికులను మననం చేసుకోవటం అంటే కొత్త తరాల్ని ప్రేరేపించటమే.

వారిద్దరూ ఆశయవాదులు మాత్రమే కాదు ఆచరణశీలురు కూడా. అందుకే తెలంగాణ రైతాంగ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తన రచనల ద్వారా ప్రసరించిన అభ్యుదయ కిరణాలు నేటి నవతెలంగాణ నిర్మాణానికి దిశానిర్దేశం చేయగల దివిటీలని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సాహిత్యరంగంలో త్యాగాలకు, భోగాలకు స్థానముంది. పోతన్నలు, సోమనాథులు, బండి యాదగిరిలు త్యాగాలకు గుర్తులుగా మిగిలారు. ఆ మార్గంలోనే వట్టికోట ఆళ్వారు స్వామి, దాశరథి నడిచారు. తమ జీవితం, నిబద్ధత, నిమగతలతో తెలంగాణ సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి మహోన్నతమైన స్థానాన్ని కల్పించారు.

ప్రస్తుతం దేశంలో చరిత్ర, సాంస్కృతిక ప్రాంగణాలు విద్వేష విష బీజాలతో నింపబడుతున్న దృశ్యం ఆందోళనకు గురిచేస్తోంది. విచ్ఛిన్నకర ఉద్దేశ్యాలతో ప్రజల సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని చెదరగొట్టే సంకుచిత భావవ్యాప్తి ఉధృతంగా సాగుతోంది. ఇలాంటి తరుణంలో గుప్తతా, వ్యక్తతా రెండూ జీవన సాఫల్యానికి సమానావసరాలని చెప్పిన సృజనకారులు దాశరథి, వట్టికోటలను మరల మరల గుర్తుచేసుకోవాల్సిన అవసరం నేటి తరానిది. ఆనాటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు వారిని చలింపజేసినవి. దీనికితోడు విస్తృతంగా పుస్తకాలు చదివే అలవాటు. ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం చదవడం, వాటిపై విమర్శ చేసుకోవడం అలవాటున్న వారు కావడం, మనిషి మీద, సమాజం మీద విశ్వాసం పెంచే విశాల దృక్పథాన్ని ఏర్పరిచే రచనలు చేశారు. అందుకు మూలం ప్రగతిశీల దృక్పథమే. ఆ బాటలో సాహితీసృజన కొనసాగించడం నేటి సాహితీకారుల కర్తవ్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -