– ప్రపంచ ఇంధన సరఫరాకు విఘాతం
– బ్యారెల్ 72 డాలర్లకు చేరిక
న్యూఢిల్లీ : అమెరికా అండతో ఇరాన్‌పై ఇజ్రాయిల్ సాగిస్తోన్న దమనకాండ ముడి చమురు ధరలకు ఆజ్యం పోస్తోన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం కాగానే మే ఫ్యూచర్స్ ధరలు ఏకంగా 8 శాతం పైగా ఎగబాకాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ అంతకుముందు ముగింపుతో పోలిస్తే 8.34 శాతం పెరిగి బ్యారెల్‌కు 78.95 డాలర్ల వద్ద్ద ట్రేడింగ్ అయ్యింది. ఇది గడచిన ఏడాది కాలంలోనే అత్యధిక ధర కావడం గమనార్హం. ఒక దశలో ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఈ ధర 12 శాతం ఎగిసి బ్యారెల్‌కు 81.5 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యుటిఐ క్రూడ్ కూడా 7.16 శాతం పెరిగి 71.82 డాలర్ల వద్ద నమోదయ్యింది.
ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత, ప్రపంచ ముడి చమురు రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన హార్ముజ్ జలసంధిని మూసివేయాలని టెహ్రాన్ పిలుపునివ్వడంతో ఆయిల్ మార్కెట్ అతలాకుతలమైంది. ఎస్‌అండ్‌పి గ్లోబల్ కమోడిటీస్ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి 28 నాటికే ఈ జలసంధి గుండా జరిగే రవాణా కార్యకలాపాలు 40-50 శాతం వరకు పడిపోయాయి. చమురు సరఫరాలో ఏర్పడే ఈ తీవ్ర అంతరాయం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
పరిస్థితిని చక్కదిద్దేందుకు సౌదీ అరేబియా, రష్యా, యుఎఇ సహా ఎనిమిది ఒపెక్ ప్లస్ దేశాలు రోజుకు 2.06 లక్షల బారెళ్ల అదనపు చమురు సరఫరాను పెంచేందుకు ఆదివారం అంగీకరించాయి. అంతర్జాతీయ ఇంధన సంస్థ ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతి బిరోల్ మాట్లాడుతూ.. మధ్యప్రాచ్య పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని.. గ్యాస్, చమురు మార్కెట్లపై పడే ప్రభావాలను అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు మార్కెట్లలో తగినంత సరఫరా ఉన్నప్పటికీ, తాజా యుద్ధ పరిణామాలు గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
భారత్ వద్ద 74 రోజులకు సరిపడ చమురు నిల్వలు
ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత చమురు భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇటీవల వెల్లడించారు. విశాఖపట్నం, మంగళూరు , పడూరులలో ఉన్న భూగర్భ నిల్వ కేంద్రాలతో పాటు రిఫైనరీల వద్ద ఉన్న నిల్వలు అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడే ఎలాంటి ఒడిదుడుకులనైనా తట్టుకోవడానికి సహాయపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే.. ఐఈఏ సిఫారసు చేసిన 90 రోజుల నిల్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ముడి చమురు సెగ
- Advertisement -
- Advertisement -



