బడ్జెట్ ప్రతిపాదన రూ.23,179 కోట్లే
గతేడాది కంటే తగ్గిన రూ.1,260 కోట్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వ్యవసాయనామ సంవత్సరం అంటూనే.. రైతుల క్షేమమే మాధ్యేయం అంటూనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి బడ్జెట్‌లో ఏటేటా నిధులను తగ్గిస్తూ పోతున్నది. గతేడాది బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.24,439 కోట్లను ప్రతిపాదించారు. ఈ ఏడాది అది రూ.23,179 కోట్లకు తగ్గిపోయింది. అంటే గతేడాది కంటే రూ.1,260 తక్కువ అన్నమాట. మొత్తం బడ్జెట్‌లో వ్యవసాయ రంగం వాటా 13.98 శాతమే. వ్యవసాయరంగం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1.11 లక్షల కోట్లు కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు లెక్కల్లో చూపెట్టారు. రెవెన్యూకోర్టుల పునరుద్ధరణ, పట్టాదారు పాసుపుస్తకంలో వాస్తవ సాగుదారుల పేర్ల నమోదు, కనీస మద్దతు ధరల నిర్ణయం ప్రస్తావనే లేదు. వ్యవసాయ ప్రణాళిక ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదల వల్ల రాష్ట్ర అవసరాల మేరకు ఉత్పత్తి చేయడానికి తగిన ప్రణాళిక కనిపించలేదు. హార్టికల్చర్ సాగే రాష్ట్రంలో క్రమంగా పడిపోతున్నది.
గతంతో ఒక్క నల్లగొండ జిల్లాలోనే 4.5 లక్షల ఎకరాల్లో బతాయి పంట సాగవ్వగా…ఇప్పుడు రాష్ట్రమంతా 4 లక్షల ఎకరాల లోపే ఆ పంట ఉంది. ప్రస్తుత బడ్జెట్‌లో ప్రకృతి వైపరీత్యాల పరిహారం, మార్కెట్ జోక్యం పథకం కింద నిధుల కేటాయింపు లేదు. పాల ఉత్పత్తి దార్లకు లీటరుకు రూ.5 ప్రోత్సాహకం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి బడ్జెట్ నిధులు కేటాయించలేదు. అయితే, పంట బీమా రూ.1866 కోట్లు కేటాయించింది. నీటిపారుదల శాఖకు మరింత పెద్ద ఎత్తున నిధులను కేటాయించాల్సి ఉండగా ఇందుకు విరుద్దంగా ఈ ఏడాది రూ. 22 వేల 615 కోట్ల మాత్రమే కేటాయించారు. గత బడ్జెట్‌తో పోల్చితే ఈ సారి రూ.758 కోట్లు కోత పెట్టారు. వ్యవసాయం, సాగునీటి రంగానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు సవరించి అవసరమైన కేటాయింపులు చేయాలనీ, పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడానికి, పంటలన్నింటికీ బోనస్ ఇవ్వడానికి బడ్జెట్ కేటాయించాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
వ్యవసాయానికి కోత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



