ఇంధన నిల్వలపై కేంద్రం అబద్ధాలు
ఎల్పీజీ సంక్షోభంపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ఆందోళన
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ సరఫరా సంక్షోభంపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మకరద్వార్ వద్ద ప్రతి పక్ష ఎంపీలు ‘సిలిండర్లు ఖాళీ..వాగ్దానాలు ఖాళీ’ అని రాసి ఉన్న భారీ బ్యానర్ తో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్, సీపీఐఎంఎల్ ఎంపీ సుదామ ప్రసాద్, డీఎంకే ఎంపీ టి.సుమతి, జేఎంఎం ఎంపీ మహువా మాజీ, ఆర్జేడీ ఎంపీ మీసా భారతి, శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపి ప్రమోద్ తివారీ మాట్లాడుతూ దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయంటూ కేంద్రం అబద్ధాలు చెబుతుందన్నారు.



