ఐసీయూలను కూడా ఆ పథకంలో చేర్చండి : బీఆర్ఎస్ సభ్యుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
బడ్జెట్ పెరగటం లేదు :హరీశ్‌రావు
ఎప్పటికప్పుడు చెల్లింపులు : మంత్రి దామోదర
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆరోగ్య శ్రీ పథకం అమలయ్యే జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో డీ-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, వాటిని ఆ పథకం పరిధిలోకి తేవాలని బీఆర్ఎస్ సభ్యుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో అత్యవసర వైద్యం కోసం ఎవరైనా ఐసీయూలో చేరితే ఆస్తులను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఐసీయూలను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చి, పేదలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) కింద ఆపరేషన్లకు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలు సరిపోవటం లేదని, అందువల్ల వాటి రేట్లను పెంచాలని కోరారు. ఆరోగ్య శ్రీ నిధుల విడుదల కోసం గ్రీన్ ఛానల్‌ను ఏర్పాటు చేసినా.ఉపయోగం లేకుండా పోయిందని వాపోయారు. మాతా శిశు సంరక్షణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్సీహెచ్ కిట్లను అందజేసిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిలిపేశారని చెప్పారు. కావాలంటే ఆ కిట్‌కు ఇందిరమ్మ కిట్ అని పేరు పెట్టుకోండి, కానీ పథకాన్ని మాత్రం ఆపకండని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు మాట్లాడుతూ… ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచామంటూ ప్రభుత్వం చెబుతోంది, కానీ ఆ మేరకు బడ్జెట్ పెరగలేదని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ కింద ఆస్పత్రులకు నిధులను ఎందుకు విడుదల చేయటం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రి దామోదర రాజనర్సింహ సమాధానమిస్తూ…తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ 9.45 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించామని తెలిపారు. గతంలో ఏడాదికి సగటున రెండున్నర లక్షల మందికి ఈ సేవలు అందగా, ఇప్పుడు ఏడాదికి 4 లక్షల మంది ఆరోగ్యశ్రీని వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఈ పథకం కింద వైద్య సేవలు అందిస్తున్న ఆస్పత్రులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నామని వివరించారు.
ఆరోగ్య శ్రీ పరిధిలో డీ-అడిక్షన్ సెంటర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



