Saturday, July 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'భద్రి'కి జాప్యం

‘భద్రి’కి జాప్యం

- Advertisement -

– వరద ముంపు పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం
– ఏడాది గడిచినా పూర్తికాని పనులు
– బొందివాగు ఎంట్రీలో ఇన్‌ఫ్లో షట్టర్స్‌ ఏర్పాటులో ఆలస్యం
– అధ్యయనం చేస్తున్న ‘నిట్‌’ బృందం
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

గ్రేటర్‌ వరంగల్‌లో వరద ముంపు నివారణ కోసం చేపట్టిన భద్రకాళి చెరువు పరిధిలో పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. భద్రకాళి చెరువు పరిధిలో వరద నియంత్రణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించి టెండర్లు పిలిచింది. ఏడాదిలోగా ఈ పనులు పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ జులైతో పనుల పూర్తికోసం గుత్తేదారు చేసుకున్న అగ్రిమెంట్‌ పూర్తి కానుంది. రూ.150 కోట్లలో భద్రకాళి చెరువులోకి బొందివాగు కలిసే చోట ఇన్‌ఫ్లో షట్టర్స్‌, రైల్వే ట్రాక్‌ నుంచి భద్రి చెరువు వరకు రెండు వైపులా 30 మీటర్ల వెడల్పుతో రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణం చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆ పనులు ప్రారంభించలేదు. భద్రకాళి చెరువులు రెండువైపులా మత్తడులున్నాయి. ఇందులో కాపువాడ వైపు మాత్రం 50 మీటర్ల నిడివితో నిర్మాణం చేసి 9 గేట్లను బిగించే పనులు సాగుతున్నాయి. ఇందులోనూ కాంక్రీట్‌ పనులు 60-70 శాతం పూర్తయ్యాయి. రెండోవైపు పోతన్‌నగర్‌ వైపు ఉన్న మత్తడి నిర్మాణం పనులు నేటికీ ప్రారంభించలేదు.

బలహీనమైన మృత్తికతో మల్లగుల్లాలు
భద్రకాళి చెరువులోకి బొందివాగు కలిసే చోట ప్రస్తుతమున్న రెండు గేట్ల స్థానంలో 20 వేల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా ఇంజినీర్లు, అధికారులు డిజైన్‌ను రూపొందిస్తున్నారు. ప్రస్తుత నిర్మాణం కేవలం 1,000-1,500 క్యూసెక్కుల వరదను మాత్రమే తట్టుకుంటుంది. కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్‌ కుంగుబాటు నేపథ్యంలో బొందివాగు ఇన్‌ఫ్లో గేట్ల నిర్మాణంపై అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు భావిస్తున్నారు.

‘నిట్‌’ బృందం అధ్యయనం
భద్రకాళి చెరువుకు బొందివాగు వరద కలిసే ప్రాంతంలో మృత్తిక నమూనాలను సేకరించి పూర్తిస్థాయి విశ్లేషణతో కూడిన నివేదికను ఇవ్వాల్సిందిగా నీటిపారుదల శాఖ అధికారులు వరంగల్‌ ‘నిట్‌’ ఇంజనీరింగ్‌ బృందాన్ని అభ్యర్థించారు. దాంతో ఆ దిశగా ‘నిట్‌’ బృందం దీనిపై లోతుగా అధ్యయనం చేస్తుంది. వారిచ్చే నివేదిక ఆధారంగా బొందివాగు ఇన్‌ఫ్లో గేట్ల నిర్మాణం, డిజైనింగ్‌ ఉండనున్నాయి. దాంతో ఈ పనుల్లో మరింత జాప్యం జరగనుంది. కాపువాడ నుంచి అలంకార్‌ బ్రిడ్జి వరకు నాలాకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మించే విషయంలో సమీప ప్రాంతంలో పలువురి భూములు ఈ నిర్మాణంలో పోతున్నాయి. వారంతా నష్టపరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు. నష్టపరిహారం ఇచ్చేలా అధికారులకు ఆదేశాలివ్వాలని నిర్వాసితులు కోర్టును కోరారు.

గడువు పూర్తయినా పూర్తికాని పనులు
భద్రకాళి చెరువు వరద నియంత్రణ పనులకు సంబంధించి 2024 జులైలో అగ్రిమెంట్‌ జరిగింది. ఏడాదిలో అంటే 2025 జులైలో ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇందులో భద్రకాళి పూడికతీత, మత్తడుల నిర్మాణం, బొందివాగు కలిసేచోట ఇన్‌ఫ్లో గేట్లు, మత్తడుల వద్ద గేట్ల నిర్మాణం, బొందివాగు ఎగువన రైల్వే ట్రాక్‌ నుంచి భద్రి వరకు, కాపువాడ మత్తడి నుంచి అలంకార్‌ జంక్షన్‌ బ్రిడ్జి వరకు రెండు వైపులా రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించాల్సి ఉంది. అయితే, కాపువాడ మత్తడి కాంక్రీట్‌ పనులు మాత్రమే సుమారు 60-70 శాతం పూర్తయ్యాయి. చివరకి పూడికతీత పనులు సైతం పూర్తి కాలేదు. పూడికతీత పనులు మే నెలలో పూర్తవుతాయని ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించినా పూర్తి కాలేదు. వర్షాలు వరుసగా కురుస్తుండటంతో పనులు నిలిచిపోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -