తర్వాతి స్థానాల్లో తెలంగాణ, ఏపీలు
భారత్‌లో వీరి వాటా 66 శాతం : శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ స్టాటిస్టికల్ రిపోర్ట్-2023
న్యూఢిల్లీ : ఉద్యోగం, ఉపాధి వంటి పని చేయగలిగి ఆర్థిక కార్యకలాపాల్లో చురుకుగా ఉండగల వయసున్న (15-59 ఏండ్లు) జనాభా శాతం ఢిల్లీలో ఎక్కువగా ఉన్నది. ఆ తర్వాతి స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు నిలిచాయి. కొత్తగా విడుదలైన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ స్టాటిస్టికల్ రిపోర్ట్-2023 ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక సమాచారం ప్రకారం.. ఈ ఏజ్‌గ్రూప్ వారు భారత్‌లో సుమారు 66 శాతంగా ఉన్నారు. ఢిల్లీలో అత్యధికంగా 70.8 శాతంగా ఉన్నారు. ఇందులో పురుషుల (70.7 శాతం) కంటే మహిళ (70.9 శాతం)లే ఎక్కువగా ఉన్నారు. ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉన్న తెలంగాణలో ఈ ఏజ్‌గ్రూప్ వాటా 70.2 శాతంగా నమోదైంది. ఏపీ 70.1 శాతంతో మూడో స్థానంలో నిలిచింది.
పట్టణాల్లో అత్యధికం
దేశ జనాభాలో 0-14 ఏండ్ల వయసున్న చిన్నారుల వాటా గణనీయంగా పడిపోయింది. 1971లో వీరి జనాభా 41 శాతంగా ఉండగా.. 2023 నాటికి 24 శాతానికి తగ్గింది. ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనగల జనాభా శాతం మాత్రం 53 శాతం నుంచి 66.1 శాతానికి పెరిగింది. వర్కింగ్‌ఏజ్ పాపులేషన్‌లో పట్టణ వాటా 68.6 శాతంతో అత్యధికంగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 64.6 శాతంగానే నమోదైంది.
బీహార్‌లో అత్యల్పం
దేశవ్యాప్తంగా పెద్ద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా (యూటీ)ల్లో 0-4 వయసు గల జనాభా 11.3 శాతంతో, 0-14 ఏజ్ గ్రూప్ 32 శాతంతో బీహార్ ముందుస్థానంలో ఉన్నది. అయితే బీహార్‌లో 15-59 ఏండ్ల ఏజ్ గ్రూప్ జనాభా మాత్రం 60.1 శాతంతో అతి తక్కువగా ఉండటం గమనార్హం. నాలుగేండ్లలోపున్న చిన్నారుల జనాభా తమిళనాడులో 5.7 శాతంతో అతి తక్కువగా ఉన్నది.
60 ఏండ్లు పైబడినవారు 9.7 శాతం..
ఇక్కడా మహిళలే అధికం
భారత్‌లో 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వారి మొత్తం జనాభా 9.7 శాతంగా ఉన్నది. ఇందులో పురుషుల (9.2 శాతం) కంటే మహిళ (10.2 శాతం) జనాభా కాస్త ఎక్కవ శాతంగా తేలింది. రాష్ట్రాలవారీగా చూస్తే ఈ ఏజ్‌గ్రూప్ వారు అధిక శాతం ఉన్న రాష్ట్రంగా కేరళ (15.1 శాతం) నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు (14 శాతం), హిమాచల్‌ప్రదేశ్ (13.2 శాతం)లు ఉన్నాయి. జార్ఖండ్ (7.6 శాతం), అసోం (7.6 శాతం), ఢిల్లీ (7.7 శాతం)లు తక్కువ శాతంతో చివరన నిలిచాయి. వృద్ధులలో అసోం, జమ్మూకాశ్మీర్ మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాలు, యూటీలలో మహిళలే ఎక్కువ శాతంలో ఉండటం గమనార్హం.
బాలికలు, మహిళల శాతం ఎక్కువ
జాతీయస్థాయిలో 0-14 ఏండ్ల ఏజ్ గ్రూప్ 24.2 శాతంగా ఉన్నది. గ్రామీణ జనాభాలో 15 ఏండ్లలోపు వయస్సున్న వారు 25.9 శాతంగా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇది 21.1 శాతం గానే నమోదైంది. ఈ ఏజ్ గ్రూప్‌లో తమిళనాడు (18.2 శాతం), ఏపీ (19.3 శాతం) లు తక్కువ జనాభా శాతాన్ని కలిగి ఉన్నాయి. 0-14 ఏజ్ గ్రూప్‌లో బాలికల కంటే బాలురు 1.3 శాతం ఎక్కువ జనాభాను కలిగి ఉన్నారు. ఇక 15 ఏండ్లకు పైబడినవారిలో మహిళల శాతం ఎక్కువగా ఉన్నది. ఇది 15-59 ఏజ్ గ్రూప్‌లో 0.3 శాతం, 60 ఏండ్లు పైబడినవారిలో 1 శాతం, 15-64 ఏజ్ గ్రూప్‌లో 1.2 శాతం ఎక్కువగా నమోదు అయ్యాయి.