– అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్
– సురక్షితంగా బయటపడ్డ పిల్లలు
– ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది
– అమీన్‌పూర్‌లో ఘటన
నవతెలంగాణ-అమీన్‌పూర్
ప్రయివేటు స్కూల్ విద్యార్థులకు భద్రత కరువయ్యింది. ఓ స్కూల్ బస్సుకు మంటలు అంటుకుని బస్సు పూర్తిగా దగ్ధమయ్యింది. డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమయ్యి విద్యార్థులను కిందికి దించడంతో పిల్లలంతా సురక్షితంగా బయటపడ్డారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నట్టయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కళ్యాణి వెంచర్, రెన్లగడ్డ సమీపంలో గురువారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు విద్యార్థులను రోజు లాగే పికప్ చేసుకొని ఉదయం 8 గంటల సమయంలో స్కూల్‌కు వస్తోంది.
ఆ సమయంలో బ్యాటరీ సమీపంలోని వైర్లు మెల్ట్ కావడంతో ఒక్కసారిగా బస్సులో పొగలు, మంటలు చెలరేగాయి. దాంతో విద్యార్థులు కేకలు వేయడంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ నర్సింలు, క్లీనర్‌తో కలిసి బస్సులో ఉన్న 6 మంది విద్యార్థులను కిందకు దింపేశారు. వెంటనే డ్రైవర్ స్కూలు యాజమాన్యానికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో, స్కూల్ యాజమాన్యం అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అమీన్‌పూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు.
అప్పటికే బస్సు సగభాగం కాలిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. ఘటన గురించి తెలుసుకొని అక్కడికి చేరుకున్న ఆర్టీవో విజరు రావు మాట్లాడుతూ.. ఉదయం 8 గంటల సమయంలో స్కూల్ విద్యార్థుల పికప్‌కు వెళ్ళిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు కళ్యాణి వెంచర్, రేన్లగడ్డ సమీపంలోని అపార్ట్‌మెంట్ దగ్గరలో ఉన్న విద్యార్థులను పికప్ చేసుకుని వస్తున్న సమయంలో బ్యాటరీ దగ్గర ఒక్కసారిగా పొగలు రావడంతో, విద్యార్థులు కేకలు వేసినట్టు తెలిపారు. గమనించిన అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్, డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో వెంటనే బస్సులోని విద్యార్థులను కిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. ఫైర్ ఇంజన్ సిబ్బంది బస్సులో నుంచి ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్కూల్ యాజమాన్యానికి సూచించారు.