Wednesday, February 11, 2026
E-PAPER
Homeమానవిబీట్‌రూట్‌తో రుచిగా..

బీట్‌రూట్‌తో రుచిగా..

- Advertisement -

బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌ సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది అధిక రక్తపోటును నివారిస్తుంది. అంతేకాకుండా రక్తహీనతను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్‌రూట్‌ను తినడానికి మాత్రం చాలా మంది ఇష్టపడరు. చిన్న పిల్లలైతే మారాం చేస్తుంటారు. అలాంటి వారికి బీట్‌రూట్‌తో కాస్త వెరైటీగా చేసి పెడితే కాదనకుండా తినేస్తారు. మళ్లీ, మళ్లీ కావాలని గొడవ చేస్తుంటారు. బీట్‌రూట్‌తో చేసే అలాంటి రుచికరమైన వంటకాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

హల్వా
కావాల్సిన పదార్థాలు: బీట్‌ రూట్‌ ముక్కలు – 2 కప్పులు, నెయ్యి – 4 టేబుల్‌ స్పూన్లు, పంచదార – కప్పు, కార్న్‌ ఫ్లోర్‌ – అర కప్పు, యాలకుల పొడి – అర టీస్పూన్‌, జీడిపప్పులు – 10, బాదం – 5.
తయారీ విధానం: కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పులు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో రెండు టీస్పూన్ల నెయ్యి వేసి, బీట్‌ రూట్‌ తరుగు వేసి పది నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత రెండు కప్పుల పాలు పోసి కలుపుకోవాలి. అందులోనే పచ్చి కోవా కూడా వేసి బాగా కలిపి దగ్గర పడే వరకు బాగా మగ్గించాలి. తర్వాత పంచదార, యాలకుల పొడిని వేసుకోవాలి. చివరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పులని వేసి కలుపుకుంటే హల్వా రెడీ. మీకు నచ్చిన షేప్‌లో ముక్కలు చేసుకోవచ్చు.

పెరుగు పచ్చడి
కావాల్సిన పదార్థాలు: పెరుగు – అర లీటర్‌, బీట్‌రూట్‌ – 1, పసుపు – పావుటీస్పూన్‌, చక్కెర – టీస్పూన్‌, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – సరిపడా, ఎండుకొబ్బరి ముక్కలు – 5, పచ్చిమిర్చి – 2, అల్లం ముక్కలు – 2, ఆవాలు – టీస్పూన్‌.
తాలింపు కోసం: ఆవాలు – అరచెంచా,జీలకర్ర – అరచెంచా, మినప్పప్పు-టీస్పూన్‌, శనగపప్పు – టీస్పూన్‌, మిరియాలు-అరటీస్పూన్‌, కరివేపాకు – 1 రెమ్మ,ఇంగువ – చిటికెడు,జీడిపప్పు- 5.
తయారీ విధానం: బీట్‌రూట్‌పై చెక్కు తీసేసుకుని గ్రేటర్‌లో పెద్ద రంధ్రాలున్న వైపు తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఓ గిన్నెలో ఎండుకొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, టీస్పూన్‌ ఆవాలు వేసి నీళ్లు లేకుండా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి.

చిక్కటి పెరుగు తీసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, టీస్పూన్‌ చక్కెర, పసుపు, కొన్ని నీళ్లు పోసి గడ్డలు లేకుండా బాగా కలపాలి. తర్వాత కొత్తిమీర తరుగు, గ్రైండ్‌ చేసుకున్న ఎండుకొబ్బరి పేస్ట్‌, బీట్‌రూట్‌ తురుము వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపును పెరుగు పచ్చడిలో కలుపుకోవాలి. వేడివేడి ఇడ్లీలను మజ్జిగలో నిమిషంపాటు ముంచిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇడ్లీలపైన ఈ బీట్‌రూట్‌ పెరుగు పచ్చడి వేసుకుని సర్వ్‌ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి.

పరాటా
కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి- 2 కప్పులు, బీట్‌రూట్‌-ఒకటిన్నర కప్పు (తురుముకోవాలి), అల్లం తురుము – అర టీస్పూన్‌, జీలకర్ర – అర టీస్పూన్‌, గరం మసాలా- అరటీస్పూన్‌, డ్రై మ్యాంగో పొడి- అర టీస్పూన్‌, కొత్తిమీర తురుము- 2 టీస్పూన్లు, పచ్చిమిర్చి- 1(సన్నగా తురుముకోవాలి), ఆయిల్‌- 3 టీ స్పూన్లు, ఉప్పు-రుచికి సరిపడా.
తయారీ విధానం: ముందుగా బీట్‌రూట్‌ పొట్టు తీసి.. ముక్కలుగా కట్‌చేసుకుని తురుముకోవాలి. స్టవ్‌ మీద పాన్‌ పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రెండు టీ స్పూన్లు నూనె పోసుకోవాలి. అల్లం తురుము, తురిమిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత తురుముకున్న బీట్‌రూట్‌, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి.. రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసుకుని మూతపెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత దీన్ని చల్లారనివ్వాలి.

ఆ తర్వాత ఉడికిన బీట్‌రూట్‌ను మిక్సీలో వేసి నీళ్లు పోయకుండా మెత్తని పేస్ట్‌లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఓ గిన్నెలో రెండు కప్పుల గోధుమ పిండిలో ఓ స్పూన్‌ నూనె, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత అందులోనే జీలకర్ర, గరం మసాలా, డ్రై మ్యాంగో పౌడర్‌, వాము వేసి కలపాలి. అలాగే బీట్‌రూట్‌ పేస్ట్‌, కొత్తిమీర వేసి పిండి ముద్దలాగ కలుపుకోవాలి. ఒకవేళ నీరు అవసరమైతే కొద్దికొద్దిగా యాడ్‌ చేసుకుంటూ మెత్తని ముద్దలాగ కలుపుకోవాలి. ఆ పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకోని పరాటాలుగా చేసుకోవాలి. స్టౌ మీద దోశ పెనం పెట్టి వేడి చేసి కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి.. దాని మీద పరాటా వేసి రెండు వైపులా గోధుమ రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన బీట్‌రూట్‌ పరాటా రెడీ. దీన్ని పెరుగు లేదా చట్నీతో తినొచ్చు..

ఇడ్లీ
కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ రవ్వ – ఒకటిం పావు కప్పు, బీట్‌రూట్‌ తురుము – అర కప్పు, పచ్చిమిర్చి – 2, నూనె – 3 టేబుల్‌స్పూన్లు, ఆవాలు – అర టీస్పూన్‌, మినపప్పు – టీస్పూన్‌, కరివేపాకు – కొద్దిగా, ఉప్పు – రుచికి సరిపడా, జీడిపప్పు పలుకులు – కొన్ని, అల్లం తరుగు – టేబుల్‌ స్పూన్‌, పెరుగు – కప్పు, ఈనో – టీస్పూన్‌, నిమ్మరసం – టీస్పూన్‌, నెయ్యి – కొద్దిగా(ఇడ్లీ ప్లేట్స్‌కి అప్లై చేయడానికి)
తయారీ విధానం: ముందుగా బీట్‌రూట్‌ని చెక్కు తీసుకొని, సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. స్టౌపై పాన్‌ పెట్టుకొని ఆయిల్‌ వేసి వేడి చేసుకోవాలి. జీడిపప్పు పలుకులను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మినపప్పు, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాక సన్నగా తరుక్కున్న అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, తరిగి పెట్టుకున్న బీట్‌రూట్‌ తురుము వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. అందులోనే ఇడ్లీ రవ్వను యాడ్‌ చేసి మరో 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకొని స్టౌ ఆఫ్‌ చేసుకోవాలి.

అది పూర్తిగా చల్లారాక అందులో రుచికి తగినంత ఉప్పు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో ముప్పావు కప్పు నీరుపోసి మరోసారి బాగా కలిపి 20 నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత ఈనో, నిమ్మరసం వేసుకొని మరోసారి బాగా కలపాలి. ఇడ్లీ పాత్రలో తగినన్ని నీరు పోసుకొని మూతపెట్టి మరిగించుకోవాలి. ఈలోపు ఇడ్లీ ప్లేట్స్‌కి కాస్త నెయ్యి అప్లై చేసి వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులను ఒక్కో గుంతలో ఒక్కొక్కటి పెట్టుకోవాలి. అందులోనే కలిపి పెట్టుకున్న పిండిని వాటిల్లో నింపుకోవాలి. ఆప్లేట్స్‌ ఇడ్లీ పాత్రలో ఉంచి మూతపెట్టి 15 నిమిషాల ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా, హెల్దీగా ఉండే బీట్‌రూట్‌ ఇడ్లీలు మీ ముందు ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -