కొందరికి కూరల కంటే రోటీ పచ్చళ్లే ఎక్కువగా నచ్చుతాయి. అయితే పచ్చడి అంటే చాలా వరకు టమాటా పచ్చడే ముందు వరుసలో ఉంటుంది. దీన్నే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు. కానీ ఇతర పచ్చళ్ల గురించి పెద్దగా పట్టించుకోరు. సొరకాయ, వెలక్కాయ, ఉలవలు, పుదీనతో ఎంతో రుచికరమైన పచ్చళ్లు చేసుకోవచ్చు. టమాటా పచ్చడి మాదిరిగానే ఇవి కూడా అద్భుతమైన రుచిని ఇస్తాయి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అలాగే ఉదయం టిఫెన్స్‌లోకి కూడా కమ్మగా తినేయొచ్చు. అలాంటి నోరూరించే పచ్చళ్లు ఎలా తయారు చేయాలో ఈ రోజు తెలుసుకుందాం…
సొరకాయ
కావల్సిన పదార్థాలు: సొరకాయ – ఒకటి(చిన్న సైజ్), టమాటాలు – నాలుగైదు(మీడియం సైజ్‌వి), నూనె – తగినంత, పొట్టు మినపప్పు – రెండు చెంచాలు, పచ్చిమిర్చి – 10 నుంచి 12, జీలకర్ర – చెంచా, ఉప్పు – రుచికి తగినంత, చింతపండు – కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు – ఏడెనిమిది.
తయారీ విధానం: ముందుగా సొరకాయను చెక్కు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి. అలాగే టమాటాలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టుకొని నూనె పోసి వేడయ్యాక పొట్టు మినపప్పుని వేసి దోరగా వేయించాలి. దీన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని పక్కనుంచాలి. అదే పాన్‌లో తగినన్ని పచ్చిమిర్చి ముక్కలుగా తుంపి వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత మినపప్పు ఉన్న మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అదే కడాయిలో మరికొద్దిగా నూనె పోసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసి కలిపి మూతపెట్టి అవి పావువంతు వరకు మగ్గే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడకబెట్టాలి. అందులో ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌లో అవన్నీ బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. అవి చల్లారేలోపు మిక్సీ జార్‌లో ఉన్న పచ్చిమిర్చి, మినపప్పులో జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మగ్గించి చల్లార్చుకున్న టమాటా, సొరకాయ ముక్కలను వేసి మరీ మెత్తగా కాకుండా రోట్లో రుబ్బుకున్న విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత తాలింపుని రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద చిన్న కడాయి లేదా పాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపుని మంచిగా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిలో వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలు. అంతే ఎంతో రుచికరమైన సొరకాయ పచ్చడి రెడీ.
పుదీనా
కావాల్సిన పదార్థాలు: పుదీనా ఆకులు – నాలుగు కప్పులు, పల్లీలు – ఐదారు టీస్పూన్లు, పచ్చిమిర్చి – 20 (తగినన్ని), టమాటాలు – నాలుగు, చింతపండు – చిన్న నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు – 15 నుంచి 20, అల్లం – చిన్న ముక్క, జీలకర్ర – ఒకటీస్పూను.
తయారీ విధానం: ముందుగా తాజా పుదీనాను తీసుకొని శుభ్రంగా కడిగి ఆకులను తుంచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే టమాటాలను శుభ్రంగా కడిగి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్‌లో పల్లీలను వేసి బాగా వేయించి పక్కనుంచాలి. తర్వాత అదే పాన్‌లో నాలుగు టీస్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. పచ్చిమిర్చిలను ముక్కలుగా తుంపి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పల్లీలు ఉన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కాసేపు కలుపుతూ వేయించి ఆపై మూతపెట్టి మూడునాలుగు నిమిషాల పాటు సన్నని మంట మీద మగ్గించుకోవాలి. తర్వాత అందులో పుదీనా ఆకులు, చింతపండు వేసుకొని ఒకసారి అన్నింటినీ బాగా కలిపి మూతపెట్టి ఐదారు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. పుదీనా, టమాటా ముక్కలు మరీ మెత్తగా ఉడకాల్సిన పని లేదు. 80శాతం ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని కాస్త చల్లార్చుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో చల్లారిన పుదీనా టమాటా మిశ్రమం జత చేసి రోట్లో రుబ్బుకున్న విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఆపై పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న కడాయి పెట్టి తగినంత నూనె వేసి వేడి చేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి వేయించాలి. అవి చిటపటమంటున్నప్పుడు ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత పసుపు వేసి వేయించాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఆ తాలింపులో వేసి బాగా మిక్స్ చేసుకుంటే చాలు. కమ్మని రుచితో నోరూరించే పుదీనా టమాటా పచ్చడి సిద్దమైనట్టే.
ఉలవ పచ్చడి
అవసరమైన పదార్థాలు: ఉలవలు – కప్పు, వెల్లుల్లి రెబ్బలు – ఏడెనిమిది, కారం – తగినంత, ఉప్పు – రుచికి సరిపడా, జీలకర్ర – అరటీస్పూను, ఆవాలు – పావుటీస్పూను, పసుపు – పావుటీ స్పూను, చింతపండు – కొద్దిగా, నూనె – ఒకట్రెండు చెంచాలు, కరివేపాకు – ఒకట్రెండు రెమ్మలు.
తయారీ విధానం: ముందుగా ఒక చిన్న గిన్నెలో చింతపండుని తీసుకొని శుభ్రంగా కడగాలి. అందులో తగినన్ని నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఉలవలను వేసి కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాడకుండా వేయించుకోవాలి. తర్వాత వాటిని చల్లారనిచ్చి బరకగా పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకొని మరొకసారి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఓ గిన్నెలోకి తీసుకొని పక్కనపెట్టి తాలింపుకు రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు వేసుకొని పోపుని మంచిగా వేయించాలి. తర్వాత స్టవ్ కట్టేసి దాన్ని ముందుగా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకున్న పచ్చడిలో వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలు.
వెలక్కాయ పచ్చడి
కావాల్సిన పదార్థాలు: వెలక్కాయ – ఒకటి, నూనె – టీస్పూను, ధనియాలు – టీస్పూను, ఆవాలు – టీస్పూను, మినప్పప్పు – టీస్పూను, శనగపప్పు – టీస్పూను, జీలకర్ర – టీస్పూను, ఎండుమిర్చి – పదిహేను, కొత్తిమీర తరుగు – గుప్పెడు, వెల్లుల్లి రెబ్బలు – పది, పసుపు – పావు టీస్పూను, ఉప్పు – సరిపడా.
తాలింపు కోసం: నూనె – రెండు టీస్పూన్లు, ఆవాలు – అర టీస్పూను, జీలకర్ర – అర టీస్పూను, శనగపప్పు – అర టీస్పూను, మినప్పప్పు – అర టీస్పూను, ఎండుమిర్చి – రెండు, కరివేపాకు – రెండు రెమ్మలు, ఇంగువ – చిటికెడు
తయారీ విధానం: వెలక్కాయను శుభ్రంగా కడగాలి. దానిపై ఉండే తొక్కును తీసేసి లోపలి భాగాన్ని మీడియం సైజ్‌లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసు కోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి ఓ నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో దోరగా వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ధని యాల మిశ్రమం, ఎండుమిర్చి రెండూ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్‌లో వేసి ఓసారి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత అందులోకి కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా అందులోకి వెలక్కాయ ముక్కలు, కొన్ని నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు కోసం పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. చివరగా ఇంగువ వేసి ఓ నిమిషం వేయిం చుకున్న తర్వాత గ్రైండ్ చేసిన పచ్చడిని వేసి ఓ ఐదు నిమిషాల పాటు అంటే కాస్త పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీగా ఉండే వెలక్కాయ పచ్చడి రెడీ.
చిట్కాలు: – వెలక్కాయ చెక్కు కాస్త గట్టిగా ఉంటుంది. కాబట్టి నిధానంగా కట్ చేసి ముక్కలుగా చేసుకోవాలి.
– వెలక్కాయ కాస్త పులుపుగా, వగరుగా ఉంటుంది. కాబట్టి కారం కాస్త ఎక్కువే పడుతుంది. ఎండుమిర్చీలను కాస్త ఎక్కువ మొత్తంలో వేసుకుంటే సరి.
– ఈ పచ్చడిని రోట్లో రుబ్బుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది.