టీఎంఎస్‌ఆర్ యూ ధర్నాలో నాయకులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తమ డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటీవ్స్ యూనియన్ (టీఎంఎస్‌ఆర్ యూ) నాయకులు కోరారు. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటీటివ్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎంఆర్‌ఏఐ) పిలుపులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రభుత్వ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర అధ్యక్షులు చీకోటి శ్రీధర్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ప్ల కార్డులు, బ్యానర్ ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చడాన్ని వ్యతిరేకించారు. బుల్లెట్లు ఓడించలేవనీ, లాఠీలు అణచలేవనీ, బీజేపీ, పీఎం మోడీ మొండి వైఖరి విడనాడాలని నినదించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్.భానుకిరణ్, సంయుక్త ప్రధాన కార్యదర్శి ఏ.నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్, 1976ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులకు చట్టబద్ధమైన పని విధానాలను రూపొందించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో మెడికల్ రిప్రజెంటీటివ్స్ ప్రవేశంపై నిషేధం ఎత్తివేసి తమ ఉద్యోగ హక్కును పరిరక్షించాలన్నారు. ఫార్మా యాజమాన్యాలు సేల్స్ పేరిట చేస్తున్న వేధింపుల నుంచి కాపాడాలనీ, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ఫార్మా యాజమాన్యాలను ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గాడ్జెట్ల ద్వారా నిఘా, ట్రాకింగ్ చేసి ఉద్యోగుల గోప్యతకు భంగం కలిగించకూడదని కోరారు. మోడీ సర్కార్ తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నవంబర్ 17న ఛలో ముంబయి, నవంబర్ 18న ఛలో ఢిల్లీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అప్పటికీ పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐ.రాజు భట్, సహాయ ప్రధాన కార్యదర్శి ఎ.నాగేశ్వర్ రావు, కోశాధికారి కె.దుర్గా ప్రసాద్ రావు, రాష్ట్ర కార్యదర్శులు జి.విద్యాసాగర్, గుండా శ్రీనివాస్, ఎ.సదానందచారి, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.