వాషింగ్టన్ : అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ సంక్షోభం తీవ్రమవుతోంది. విధి నిర్వహణలో ఉన్న కొందరు ప్రభుత్వోద్యోగులకు, సైనిక సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు ఉద్దేశించిన బిల్లు శుక్రవారం సెనెట్ ఆమోదం పొందలేకపోయింది. ప్రభుత్వ షట్‌డౌన్ సమయంలో చాలా మంది ప్రభుత్వోద్యోగులు వేతనాలు తీసుకోకుండానే పని చేయాల్సి ఉంటుంది. షట్‌డౌన్ ముగిసిన తర్వాతే వారికి ఆ కాలానికి సంబంధించిన వేతనాలు చెల్లిస్తారు. కొందరు ఉద్యోగులకు వేతనాల చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు సెనెట్‌లో వీగిపోయింది. ఈ బిల్లును డెమొక్రాట్లు వ్యతిరేకించారు. ఇది ట్రంప్ ప్రభుత్వంపై ఎలాంటి నియమ నిబంధనలు విధించలేకపోయిందని వారు ఆరోపించారు.
బిల్లుపై చర్చను కుదించి సత్వరమే తుది ఓటింగ్ జరపాలంటే కనీసం 60 ఓట్లు అవసరమవుతాయి. కానీ బిల్లుకు అనుకూలంగా 53 ఓట్లు మాత్రమే పడ్డాయి. 43 మంది బిల్లును వ్యతిరేకించారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినప్పటికీ దానికి అవసరమైన ఓట్లు లభించలేదు. రెండు వారాల క్రితం జరిగిన తొలి ఓటింగులో కూడా బిల్లు గట్టెక్కలేకపోయింది. ఉద్యోగులలో ఎవరెవరికి జీతాలు చెల్లించాలో నిర్ణయించే అధికారాన్ని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కే కట్టబెట్టడంతో తాము బిల్లును వ్యతిరేకించామని డెమొక్రాట్లు తెలిపారు.
ఉద్యోగుల వేతన బిల్లును అడ్డుకున్న డెమొక్రాట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



