- చివరకు న్యాయమే గెలిచిందన్న గ్రామస్తులు
- బాధ్యులపై కఠిన చర్యల కోసం డిమాండ్
- అధికారులు చేయలే, అడ్వకేట్ చేశారు
- నవతెలంగాణ – దోమకొండ
- కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన భూమిపై అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను గురువారం అధికారులు కూల్చివేయడం ద్వారా గ్రామంలో న్యాయం గెలిచిందన్న భావన వ్యక్తమవుతోంది. అక్రమ కట్టడాన్ని రాజకీయ పలుకుబడితో కట్టడంతో అధికారులు సైతం వెనుకంజ వేశారు అయినప్పటికీ హైకోర్టు అడ్వకేట్ ముందుకు వచ్చి పోలీసులు అధికారులతో కలిసి అక్రమ కట్టడని కూల్చివేయించారు. అక్రమ కట్టడం వెనుక మాజీ ఉప సర్పంచ్ ముత్తగారి శిరీష్ గౌడ్ తన భార్య ముత్తగారి రోజా పేరుపై రిజిస్టర్ చేసి నిర్మించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ హై కోర్టు తుది ఆదేశాల మేరకు ఈ కూల్చివేత పై చర్యలు చేపట్టారు.
పాఠశాల స్థలం అక్రమన పై గ్రామస్తుల ఆగ్రహం…
గ్రామస్తుల కథనం ప్రకారం, ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన సర్వేనెంబర్ 638/ ఎ /1, 638 /ఎ/ 2,638/ ఎ ఏ లో రెండు ఎకరాల 11 గుంటల స్థలం సుమారు రెండు కోట్ల వరకు విలువచేసే స్థలాన్ని గత ప్రభుత్వ కాలంలో ఉప సర్పంచ్‌గా ఉన్న శిరీష్ గౌడ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆక్రమించారు. ఆ స్థలాన్ని తన భార్య రోజా పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రారంభించారు.
నిర్మాణం ప్రారంభ దశలోనే గ్రామస్తులు ఈ విషయాన్ని గుర్తించి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. అయిన ఫలితం లేకపోవడంతో గ్రామస్తులతా కలిసి కోర్టును ఆశ్రయించి గ్రామస్తులు న్యాయపోరాటానికి దిగారు. ప్రభుత్వ భూమిని రక్షించేందుకు, పిల్లల భవిష్యత్తు కోసం గ్రామస్తులు కలిసి తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. కోర్టు ప్రారంభంలోనే నిర్మాణాన్ని యథాస్థితిలో నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే, కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా రాజకీయ పలుకుబడితో అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని నీర్మాణాన్ని పూర్తి చేసి, షాపులు, గదులను అద్దెకు ఇచ్చినట్లు గ్రామస్తులు ఆరోపించారు.
హైకోర్టు తుది ఆదేశాలు.. జేసీబీతో కూల్చివేత
సుమారు నాలుగు నుంచి ఐదేళ్ల పాటు కేసు విచారణ కొనసాగిన అనంతరం, హై కోర్టు స్పష్టమైన తుది తీర్పు ఇచ్చింది. ఆక్రమిత కట్టడాలను పూర్తిగా కూల్చివేసి, ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వ పాఠశాలకు అప్పగించాలని ఆదేశించింది. అధికారులు ఆలస్యం చేయడంతో, హై కోర్టు అడ్వకేట్ సరళ మహేందర్ ముత్యంపేటకు చేరుకొని దోమకొండ ఎస్సై ప్రభాకర్ భద్రతతో డి ఎల్ పి ఓ శ్రీనివాస్ ఎంపీడీవో ప్రవీణ్ ఎమ్మార్వో సుధాకర్ ల సమక్షంలో జేసీబీ యంత్రాలతో అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారు. ప్రస్తుతం ఆ భూమిని అధికారికంగా పాఠశాల యాజమాన్యానికి అప్పగించారు.
జర్నలిస్టులపై కేసులు – గ్రామస్తుల ఆగ్రహం
ఈ అక్రమ నిర్మాణంపై గతంలో వార్తా కవరేజ్ చేసిన జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం కూడా తీవ్ర వివాదానికి కారణమైంది. నిజాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన జర్నలిస్టులను భయపెట్టేందుకు కేసులు పెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
పిల్లల భవిష్యత్తు కోసమే
పాఠశాల భూమిని కాపాడటం కోసం మేము ఎన్నో సంవత్సరాలు పోరాడాం. చివరకు న్యాయం జరిగింది. ఇది గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనం” అని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో ఇకపై ప్రభుత్వ భూములపై ఎలాంటి అక్రమాలు జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే శిరీష్ గౌడ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కట్టుదిట్టమైన చర్యలు అవసరమని, ఈ ఘటన ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారుల బాధ్యతను మరోసారి గుర్తు చేసింది. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు కఠిన పర్యవేక్షణ, అక్రమాలకు పాల్పడిన వారిపై తక్షణ చర్యలు అవసరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ముత్యంపేట ఘటన న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచిందనీ చెప్పాలి.



