డిమాండ్లు సాధించేవరకు పోరాటం ఆగదు
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం వైపు పాదయాత్రగా వెళుతున్న ఆశా వర్కర్లను పోలీసులు బుధవారం నిర్భంధించారు. వివిధ జిల్లాలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు చెప్పారు. బెంగాల్‌లో గతేడాది డిసెంబరు 23 నుంచి ఆశా వర్కర్లు ఆందోళనలో ఉన్నారు. ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం వైపునకు ఆశా వర్కర్లు వెళ్లకుండా సీల్దా, హౌరా రైల్వే స్టేషన్ల వెలుపల మంగళవారం రాత్రి నుంచే పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. హౌరా స్టేషన్ నుంచి బయటకు రాకుండా పోలీసులు తమను నిరోధించారని పశ్చిమ దినాజ్‌పూర్‌కు చెందిన ఆశా వర్కర్లు మీడియా ప్రతినిధులకు తెలిపారు.
ఏదో విధంగా ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ ఆందోళనకు దిగిన ఆశా వర్కర్లను కూడా పోలీసులు నిర్భంధించారు. ప్రస్తుతం బెంగాల్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు పనితీరు ఆధారంగా అలవెన్సులను ఇస్తోంది. అయితే దీనికి బదులుగా స్థిరమైన నెలవారీ జీతం కోసం ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 8న ఆరోగ్య శాఖ ప్రధానకార్యాలయం ‘స్వాస్థ్య భవన్’కు మార్చ్ నిర్వహించారు. ఈ నెల 12న నిరసన ప్రదర్శన నిర్వహించారు. తాజాగా బుధవారం కూడా స్వాస్థ్య భవన్‌కు అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్ మార్చ్‌కు పిలుపు ఇచ్చింది. ఈ సందర్భంగా స్వాస్థ్య భవన్ చుట్టూ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడిక్కడ ఆశా వర్కర్లను నిర్భంధించారు.



