Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఅనారోగ్య కారణాలతోనే ధన్కర్‌ రిజైన్‌

అనారోగ్య కారణాలతోనే ధన్కర్‌ రిజైన్‌

- Advertisement -

దీనిపై ఎక్కువ సాగదీత వద్దు

– చర్చను ఇక్కడితో ముగించాలి
– కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

న్యూఢిల్లీ : భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్కర్‌ రాజీనామాకు ఆయన వ్యక్తిగత అనారోగ్య సమస్యలే కారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. ఈ విషయాన్ని ఇంకా సాగదీయొద్దని చెప్పారు. దీనిపై చర్చను ఇక్కడితో ముగించాలని తెలిపారు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పలు అంశాలపై మాట్లాడిన ఆయన జగదీప్‌ ధన్కర్‌ రాజీనామా వ్యవహారం పైనా చర్చించారు. అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేస్తున్నానన్న విషయాన్నీ ధన్కర్‌ సైతం తన రాజీనామా లేఖలో స్పష్టం చేశారని అమిత్‌ షా గుర్తు చేశారు. ఉపరాష్ట్రపతిగా ధన్కర్‌ తన పదవీ కాలంలో రాజ్యాంగం ప్రకారం విధులను చక్కగా నిర్వర్తించారని చెప్పారు. ఈ ఏడాది పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటిరోజే జగదీప్‌ ధన్కర్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతోనే రిజైన్‌ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. వాస్తవానికి ధన్కర్‌ పదవీ కాలంలో మరో రెండేండ్లు ఉండగానే ఈ నిర్ణయం తీసుకోవటం పట్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడిచింది. పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అభిశంసన తీర్మానం విషయంలో.. రాజ్యసభ చైర్మెన్‌గా ఉన్న ఆయన కాంగ్రెస్‌ ఇచ్చిన తీర్మానాన్ని ఆమోదించారు. అయితే ఈ పరిణామం బీజేపీ అధిష్టానానికి, ముఖ్యంగా మోడీ-షా ద్వయానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందనీ, ఇదే ధన్కర్‌ రాజీనామాకు కారణమైందని రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగాయి. కాగా ధన్కర్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి స్థానానికి వచ్చేనెల 9న ఎన్నిక జరగనున్న విషయం విదితమే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా సి.పి రాధాకృష్ణన్‌, ఇండియా బ్లాక్‌ క్యాండిడేట్‌గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డిలు బరిలో ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad