అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన తండాలను చూసి చలించిపోయి వారి పక్షాన నిలబడ్డ నాయకుడు గుగులోత్ ధర్మా.నాయక్. ఉమ్మడి ఖమ్మం జిల్లా సుజాతనగర్ మండలం మంగపేట తండాలో పుట్టిన ఆయన సమాజంపై లోతైన అధ్యయనం చేశాడు. రాజ్యాంగం కల్పించిన హక్కులు గిరిజనుల దరి చేరకపోవడంతో పాలకుల నిర్లక్ష్యాన్ని గుర్తించాడు. దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడుతూ వారిని మోసం చేస్తున్నారని భావించాడు. దీంతో వారి సమస్యల పరిష్కారానికి మార్క్సిజమే సరైన మార్గమని నమ్మి చివరివరకూ పేదల కోసం పోరాటం నడిపాడు. ఐటిఐ వరకు చదువుకున్న ధర్మా ముందు విద్యార్థి సంఘంలో పనిచేస్తూ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషిచేశాడు. ఆ తరుణంలోనే గోదావరిఖనిలోని సింగరేణిలో ఎలక్ట్రిషియన్‌గా ఉద్యోగం వచ్చింది. కొంతకాలం పనిచేసినప్పటికీ ఆయన ధ్యాసంతా అణచివేయబడుతున్న సామాజిక వర్గాలపై ఉండటంతో వారి కోసమే తను జీవించాలనుకున్నాడు. ఉద్యోగాన్ని వదిలిపెట్టి మార్కిస్టు పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా చేరాడు. యువజన సంఘంలో పనిచేసి కొత్తగూడెం డివిజన్ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నాడు. నిరుద్యోగం, ఉపాధి, ఉద్యోగం కోసం ప్రభుత్వం చేస్తున్న అలసటను గ్రహించి వాళ్లను ఐక్యం చేసి పోరాటం కొనసాగించాడు. ఆ సమయంలోనే సింగరేణి కొత్తగూడెం గిరిజన టింబర్స్ వర్క్స్ అసోసియేషన్ సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశాడు. అలాగే వ్యవసాయ కార్మిక సంఘం కొత్తగూడెం డివిజన్ కార్యదర్శిగాబాధ్యతలు నిర్వర్తించాడు. గ్రామ గ్రామానా మీటింగులు, సభలు నిర్వహించి ప్రజల్లో చైతన్యానికి బాటలు వేశాడు. కొంతకాలం ప్రజాశక్తిలో విలేకరిగా పనిచేసి అనేక ప్రజల సమస్యల్ని వెలికితీశాడు. సీపీఐ(ఎం) కొత్తగూడెం పట్టణ కార్యదర్శిగా, ఇల్లందు డివిజన్ కార్యదర్శిగా, ఖమ్మం జిల్లా కమిటీ సభ్యునిగా అనేక బాధ్యతల్లో ఉండి ప్రజల్లో సంఘటిత పోరాటాలకు నాయకత్వం వహించాడు.
ప్రజల్లో ఉంటూ, వారిని మమేకంగా మెలిగిన ధర్మా. 1981 పెనగడప సర్పంచిగా పోటీ చేయడంతో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. కేవలం రెండేండ్లలోనే 1983లో ఇల్లందు ఎమ్మెల్యేగా పోటీచేసే స్థాయికి ఎదిగాడు.అంటే ఆయన మార్కిస్టు పార్టీలో ఎంత అంకితభావంతో పనిచేశాడో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే 1999లో ఖమ్మం ఎంపీగానూ పోటీ చేశాడు. కానీ అన్ని సమయాల్లోనూ అతన్ని ఓటమే చవిచూసింది. అయినా ఆయన ప్రజల కోసం పనిచేయాలన్న తపన నుంచి విరమించు కోలేదు. నిరంతరం ప్రజల్లోనే ఉన్నాడు. ఈసారి మాత్రం అన్ని ఓటముల మధ్య ఒక గెలుపు ఆయన్ను ఆకాశమంతా ఎత్తుకు ఎదిగేలా చేసింది. జూలూరు పాడు జడ్పీటీసీగా గెలిచాడు. ప్రజా ప్రతినిధిగానూ సేవలందించాడు. అలాగే గిరిజనుల్లో ఉన్నటువంటి అనైక్యత, మూఢ నమ్మకాలు, తండాల వెనుకబాటు తనాన్ని గుర్తించి 1994లో బంజారా సంఘం (మైదానం)ఏర్పాటు చేసి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.ఈ తరుణంలోనే ఖమ్మం కేం ద్రంగా బంజారా గిరిజనులకి ప్రత్యేక భవనం కోసం పట్టుబట్టి భవనం సాధించాడు. ఆ తర్వాత 2004లో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికై ఆరేండ్లపాటు పనిచేశారు.
తండాలకు దారులు లేవు. మంచినీటి సౌకర్యం అంతకన్నా లేదు. కరెంటు, రోడ్లు, మరుగుదొడ్లు కానరావు. అసలు గిరిజనులకు సాటి మనుషులుగా కూడా చూసే పరిస్థితి లేదు. పూర్తిగా అడవి ఆధారిత జీవనం కొనసాగుతున్నది, అటవీ ఫలాలు, పశువులు, మేకల పెం పకం వ్యవసాయం మీద ఆధారపడ్డ గిరిజనం దుర్భర జీవితాన్ని గడుపుతున్నటువంటి దుస్థితి. ఎంతగానో చలించిపోయిన ధర్మా 2006లో పాదయాత్ర చేపట్టాడు.546 తండాలు, ఐదు మున్సిపాలిటీలు, 60 రోజుల పాటు మొత్తంగా 1200 కిలోమీటర్ల ఈ యాత్ర కొనసాగి ప్రజల దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. ఇంకా అనేక సమస్యల్ని గుర్తించి ఉద్యమాల్ని నిర్మించాడు. తండాలను పంచాయతీలుగా గుర్తించాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని, ఖమ్మం జిల్లా ప్రాంతంలో ఐటిడిఏ ఏర్పాటు చేయాలని అందరినీ ఐక్యం చేసి ఉద్యమించాడు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలకు గుర్తించడమంటే ధర్మానాయక్ లాంటి పోరాటాల వల్లనే అని చెప్పకతప్పదు. ఆయన ఒక్క గిరిజనుల కోసమే కాదు, అన్ని వర్గాల ప్రజల కోసం ఉద్యమించాడు. పేదల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ధర్మా 2023లో అనారోగ్యంతో కన్నుమూశాడు. మన మధ్య భౌతికంగా లేకున్నా ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న నేత ధర్మా. ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలి. అలాగే నవంబర్ 5న సుజాత్‌నగర్‌లో నిర్వహించే ధర్మా వర్థంతిని జయప్రదం చేయాలి.
మూడ్ ధర్మనాయక్
9490098695
పేదల పక్షాన ‘ధర్మా’ పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



