Sunday, July 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎన్‌హెచ్‌ఎం డైరెక్టరేట్‌ ఎదుట ధర్నా

ఎన్‌హెచ్‌ఎం డైరెక్టరేట్‌ ఎదుట ధర్నా

- Advertisement -

రూ.15 వేల వేతనమివ్వాలని నాలుగో తరగతి ఉద్యోగుల డిమాండ్‌
నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)లో పనిచేస్తున్న నాలుగో తరగతి కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీఓ నెం.60 ప్రకారం వేతనం రూ.15,600 ఇవ్వాలని కోరుతూ శనివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ కోఠిలోని ఎన్‌హెచ్‌ఎం డైరెక్టరేట్‌ ఎదుట భారీ ధర్నా చేశారు. ఉద్యమాల ఫలితంగా కొంతమందికి వేతనాలు పెరిగినప్పటికీ, నాలుగో తరగతి సిబ్బందికి మాత్రం రూ.10,400 ఇచ్చే జీవో తీసుకురావడం తీవ్ర అన్యాయమని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ అన్నారు. రాష్ట్రంలో దాదాపు వెయ్యి మంది నాలుగో తరగతి సిబ్బంది ఈ స్కీం కింద పనిచేస్తున్నారని, వీరికి కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు అమలు చేయాలని కోరారు. ఆర్‌బీఎస్‌కే వాహనాల ఓనర్లు, డ్రైవర్లకు 7 నెలలుగా అద్దె బకాయిలు చెల్లించకపోవడం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, వాహన ఈఎంఐలు, డీజిల్‌ ఖర్చులు కూడా భరించలేని స్థితి ఉందని తెలిపారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిలో కొందరికి అధిక వేతనాలు ఇస్తూ.. నాలుగో తరగతి ఉద్యోగులకు మాత్రం అన్యాయం చేస్తున్నారని అన్నారు. అనంతరం చీఫ్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ పద్మజాకు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమా రాజేష్‌ ఖన్నా, ఆర్‌బీఎస్‌కే వాహన ఓనర్ల సంఘ అధ్యక్షులు బాలయ్యగౌడ్‌, గౌరవాధ్యక్షులు రమేష్‌, ప్రధాన కార్యదర్శి జగన్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలసుబ్రమణ్యం, జి.జ్యోతి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -