సచివాలయాన్ని ముట్టడించిన రజక, దళిత, సామాజిక, ప్రజా సంఘాలు
అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులు
అక్కడే బైటాయించి నిరసన..ఉద్యమకారుల అరెస్ట్
కుమ్మెర నిందితులపై చర్యలకు డిమాండ్
ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం : పైళ్ల ఆశయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామానికి చెందిన రజక, దళిత కుటుంబంపై దాడి, రెండు నెలల పసిపాపను హత్య చేసిన పెత్తందారులను అరెస్ట్ చేయాలంటూ రజక, దళిత, సామాజిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్యమకారులు ధర్నా చేపట్టారు. ఆ గ్రామ సర్పంచ్‌ను, పెత్తందార్లను అరెస్ట్ చేయాలనీ, స్థానిక ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీని అరెస్ట్ చేయాలనీ, తమకు న్యాయం చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ప్లకార్డులు, బ్యానర్‌ను ప్రదర్శించారు. కొద్దిసేపటికే అక్కడ్నుంచి సచివాలయం వైపు బయలుదేరేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో నిరసనకారులు పోలీసులను ఛేదించుకుంటూ సచివాలయం వైపు వేగంగా నడిచారు. మరికొద్ది మంది అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనను కొనసాగించారు.
రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.ఆశయ్య, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాంనాయక్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు కె.ఎన్.ఆశాలత తదితరులు పెద్ద సంఖ్యలో సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయం పార్కింగ్ వైపు ఉన్న గేటుకు సమీపంలోకి నిరసనకారులు రాగానే పెద్ద సంఖ్యలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించిన నిరసనకారులు రెండు నెలల పసిపాపను చంపినా న్యాయం చేయరా అంటూ నిలదీశారు. వారిని బలవంతంగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో నిరసనకారులు ప్రతిఘటించారు. న్యాయం కోసం వచ్చిన తమనెందుకు అరెెస్ట్ చేస్తారంటూ అక్కడే కూర్చుండిపోవడంతో పోలీసులు బలవంతంగా వారిని అరెస్ట్ చేసి వాహనాల్లోకి ఎక్కించారు. అక్కడ్నుంచి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
అయితే వాహనాల్లోకి ఎక్కించిన తర్వాత కూడా పలువురు ఉద్యమకారులు క్రిందికి దిగి తమ నిరసన మళ్లీ కొనసాగించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకటికి రెండు సార్లు బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్‌తో పాటు ఒకరిద్దరు పోలీసులను ఛేదించుకుని సచివాలయం గేటుకు అత్యంత సమీపంలోకి వెళ్లగా అక్కడి నుంచి పోలీసులు బలవంతంగా తీసుకొచ్చి వాహనాల్లోకి ఎక్కించారు. కూర్చున్న వారిని అరెస్ట్ చేస్తుండటంతో ఉద్యమకారులు మండుటెండల్లో రోడ్డుపైనే పడుకుండిపోయారు. అనంతరం వారిని కూడా పోలీసులు ఎత్తుకెళ్లి వాహనాల్లో తీసుకెళ్లారు. ఒక వైపు ఉద్యమకారులను అరెస్ట్ చేసి తరలిస్తుంటే మరికొంత మంది సచివాలయం ముట్టడికి రావడంతో దాదాపు గంట సేపు ఉద్యమకారులు రావడం, వారిని అరెస్ట్ చేయడంతో ఆ ప్రాంతం వియ్ వాంట్ జస్టిస్ నినాదాలతో మారుమోగింది.
ఐద్వా రాష్ట్ర నాయకురాలు కె.ఎన్.ఆశాలత, మరో ఇద్దరు మహిళలతో సచివాలయం ముందు చాలా సేపు బైఠాయించారు. పోలీసుల అక్కడ నుంచి లేవాలని కోరినప్పటికీ వినిపించుకోలేదు. పసిపాప చావుకు కారకులైన వారిని అరెస్ట్ చేసి న్యాయం చేసే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఈ క్రమంలో పోలీసులు రెండు, మూడు దశల్లో వచ్చిన నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేస్తూ తరలించారు. సచివాలయం ముట్టడి కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు స్కైలాబ్ బాబు, కోట రమేష్, మూడ్ శోభన్, గుమ్మడిరాజు నాగరాజు, దామెర కిరణ్, దశరథ్, పవన్, శ్రీనివాస్, గోపాల్, మల్లేష్, బాలకృష్ణతో పాటు రజక సంఘాల ఐక్య కార్యాచరణ పరిరక్షణ కమిటీ నాయకులు ఫైళ్ళ ఆశయ్య, జూపల్లి రాజశేఖర్, కొత్తకొండ్ల శ్రీలక్ష్మి, పెద్దాపురం కుమార్ స్వామి, గోపి రజక, అక్క రాజు శ్రీనివాస్ ,కొన్నె సంపత్, ఏం నరసింహ, మొగ్గ అనిల్ బాలాపూర్ బలరాజ్ కుమార్, వరుసపల్లి నరసింహ, సట్టు దుర్గాప్రసాద్ చిట్యాల సంధ్య సకినాల రవి, సురిగల రమేష్, వెంకట్ రాములు, అభయాంధర్, కుమార్ గాడ్గే, సుంకటి పోశెట్టి, చిరుకల శంకర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం : పైళ్ల ఆశయ్య
కుమ్మెర గ్రామ బాధితులకు న్యాయం చేయాలనీ, పెత్తందారులందరిని అరెస్ట్ చేయాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయడం, ఆ గ్రామ సర్పంచ్‌ను తప్పించడం, ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా చేపట్టిన సచివాలయం ముట్టడి విజయవంతమైందని తెలిపారు. అరెస్ట్ అనంతరం ఆయనను చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించి ఉద్యమాన్ని ఆపాలని భావిస్తే ప్రభుత్వానికే సిగ్గుచేటని విమర్శించారు.
వెంటనే దాడి చేసిన నిందితులందరిని అరెస్ట్ చేయాలనీ, పసిపాప హత్యకు కారకులైన వారిపై హత్య కేసు పెట్టాలనీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలనీ, అదే విధంగా బాధిత కుటుంబానికి రూ.కోటి, ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ప్రభుత్వం స్పందించ కపోతే రాబోయే కాలంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అన్ని కలెక్టరేట్లను దిగ్బంధం చేస్తాం. గ్రామ స్థాయి నుంచి పైస్థాయి వరకు ఉద్య మాన్ని అన్ని స్థాయిలో కొనసాగిస్తామని తెలిపారు.
రజక, సామాజిక, ప్రజా సంఘాల పిలుపు
రజక, ప్రజా సంఘాల నాయకుల అరెస్టులకు నిరసనగా, శుక్ర, శనివారాల్లో (నేడు, రేపు) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం, ధర్నాలు రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలకు రజక, సామాజిక, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఉద్యమకారులను అక్రమంగా అరెస్టు చేసి హైదరాబాద్ నగరంలో ఉన్న అనేక పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలపాలని కోరాయి.



