రాణించిన రిషబ్ పంత్
బెంగళూరు : ధ్రువ్ జురెల్ (127 నాటౌట్, 170 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా రెండో అజేయ సెంచరీతో చెలరేగాడు. దక్షిణాఫ్రికా-ఏతో రెండో అనధికార టెస్టులో జురెల్ సెంచరీతో భారత్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటర్లు విఫలమవగా.. ధ్రువ్ జురెల్ శతకం సాధించాడు. నాలుగు రోజుల మ్యాచ్‌లో రెండు సెంచరీలు సాధించిన జురెల్.. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు తుది జట్టు కూర్పును ఆసక్తికరంగా మార్చాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (65, 54 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) తనదైన శైలిలో ధనాధన్ ఇన్నింగ్స్ నమోదు చేశాడు. టెయిలెండర్ హర్ష్ దూబె (84, 116 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) సైతం సూపర్ ఫిఫ్టీతో మెరిశాడు. అభిమన్యు ఈశ్వరన్ (0), కెఎల్ రాహుల్ (27), సాయి సుదర్శన్ (23), దేవదత్ పడిక్కల్ (24) నిరాశపరిచారు. భారత్-ఏ రెండో ఇన్నింగ్స్‌లో 89.2 ఓవర్లలో 7 వికెట్లకు 382 పరుగులకు ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్ ప్రకటించింది. సఫారీలకు 417 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా-ఏ 11 ఓవర్లలో 25/0తో ఆడుతోంది. సఫారీలకు మరో 392 పరుగులు అవసరం కాగా.. భారత్-ఏ విజయానికి పది వికెట్ల దూరంలో నిలిచింది.
ధ్రువ్ జురెల్ అజేయ సెంచరీ
- Advertisement -
- Advertisement -



