Friday, March 20, 2026
E-PAPER
Homeజాతీయంబాధితులకు న్యాయం చేశారా ? నీరుగార్చారా ?

బాధితులకు న్యాయం చేశారా ? నీరుగార్చారా ?

- Advertisement -

ఉనా కేసులో పదేండ్ల తర్వాత వెలువడిన తీర్పు
న్యూఢిల్లీ : దేశాన్ని దిగ్భ్రాంతికి, కలవరపాటుకు గురి చేసిన అత్యంత దారుణమైన సంఘటన 2016లో జరిగితే పదేండ్ల తర్వాత ఇప్పుడు ఆ కేసులో తీర్పు వెలువడింది. అయితే ఈ తీర్పుతో అసలు ఈ కేసులోని బాధితులకు న్యాయం జరిగిందా? లేక న్యాయాన్ని నీరుగార్చారా? అనే సందేహం తలెత్తుతోంది. న్యాయం, జాప్యం, జవాబుదారీతనం వంటి అంశాలకు సంబంధించి తీవ్రమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కేసులోని కీలకమైన నిందితులకు విధించిన శిక్షా కాలం ఇప్పటికే అందరికీ పూర్తికాగా, చాలామందిని నిర్దోషులుగా విడిచిపెట్టారు. దీంతో కుల వివక్షతో జరిగిన ఈ హింసాకాండలో అసలు నిజమైన న్యాయం అందిందా లేదా అనే అంశం తెరపైకి వచ్చింది.ఐదుగురు కీలకమైన నిందితులకు లైంగికదాడి చట్టం కింద ఐదేండ్లు జైలు శిక్ష విధించారు. కానీ వీరు ఇప్పటికే విచారణ సందర్భంగా ఆరేండ్లు గడిపినందున వారందరూ విడుదలకు అర్హులు. అటువంటపుడు ఇంతటి హేయమైన నేరానికి విధించే శిక్ష తగిన రీతిలోనే వుందా అనే అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వెరావల్‌ సెషన్స్‌ కోర్టు 340 పేజీలతో తీర్పును వెలువరించింది. కాగా ఈ కేసుకు సంబంధించిన తీర్పులో ప్రధానంగా రెండు అంశాలను ఎత్తిచూపాల్సి వుంది. మొదటిది న్యాయంలో జాప్యం.ఈ కేసులో తీర్పు వెలువడేందుకు ఏకంగా దశాబ్ద కాలం పట్టింది. ఇక రెండోది న్యాయాన్ని నీరు గార్చడం-నిందితులకు తేలికపాటి శిక్షలు విధించడం. అంతకంటే దిగ్భ్రాంతి కలిగించే అంశమేమంటే, 40మంది నిందితుల్లో 35మందిని నిర్దోషులుగా విడిచిపెట్టడం. వీరిలో పోలీసులతో మంచి సంబంధాలు వున్న వారు కూడా కొందరు వుండడం గమనార్హం.

ఈ తీర్పుతో బాధితుల కుటుంబాలు తీవ్రమైన అభద్రతా వాతావరణంలో పడ్డాయి. వారు తీవ్రమైన నిరాశా నిస్పృహలకు గురయ్యారు.వ్యవస్థాగత అణచివేతకు, కుల హింసకు ఒక చిహ్నంగా మారిన ఈ నేరానికి తాజాగా ఇచ్చిన తీర్పుతో న్యాయం జరిగిందా ? లేక నీరుగారిందా? అని ఆలోచిస్తే కుల ప్రాతిపదికన జరిగే హింసకు సంబంధించిన కేసులను ఎదుర్కొనడంలో దేశ జ్యుడీషియల్‌ వ్యవస్థ సమర్ధతపై అనేక ప్రశ్నలను ఈ కేసు లేవనెత్తుతోంది. వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించి, నిజమైన న్యాయాన్ని అందించాలంటే మరింత పటిష్టమైన చట్టాలు వుండాల్సిన, మరింత వేగంగా విచారణలు జరగాల్సిన, మరింత అర్ధవంతమైన శిక్షలు విధించాల్సిన అవసరాన్ని ఈ తీర్పు నొక్కి చెబుతున్నట్లు కనిపిస్తోంది.

అసలేం జరిగింది ?
2016 జులై 11న గుజరాత్‌లోని గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లాలోని ఉనా పట్టణంలో గో రక్షకులుగా చెప్పుకునే అగ్రవర్ణాలకు చెందిన కొంతమంది వ్యక్తులు కలిసి నలుగురు దళితులపై సామూహింకగా దాడులకు దిగారు. వారి బట్టలూడదీయించి, ఒక వాహనానికి కట్టేసి, రాళ్ళు, ఇనుప రాడ్‌లతో నాలుగైదు గంటల పాటు దారుణంగా కొట్టారు. పైగా వారిని పట్టణంలో ఊరేగింపుగా తిప్పుతూ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారు. ఈ దాడి అంతటినీ వీడియో తీసిన ఆ దుండగులు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేశారు. దానిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. గుజరాత్‌ అంతటా తీవ్రంగా నిరసనలు, ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దళిత హక్కుల ఉద్యమంగా రూపాంతరం చెందింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -