‘పాపకి కొంచెం అండర్వేర్‌లో తెల్లగా ఉంటుంది!’.. ‘పాప వయసెంత?’.. ‘ఇంకో రెండు నెలల్లో ఎనిమిదో ఏడు పూర్తవుతుంది’.. అయిదే ఇది మాములుగా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ కావొచ్చు. అంతకంటే కూడా తరచుగా పాప ‘పెద్దదవ్వడానికి’ ఆరంభ దశ కావొచ్చు. ఎనిమిదేండ్లు నిండే లోగానే యుక్తవయసు మార్పులు మొదలవ్వడం గత కొన్నేళ్లుగా చాలామంది ఆడపిల్లల్లో గమనిస్తున్న విషయం. అయితే తల్లిదండ్రులకు దీనిపై ఏ మాత్రమూ అంచనా ఉండకపోవచ్చు. ఆ వయసుకి మానసికంగా, చూడడానికి కూడా వారు చిన్నపిల్లలు. వారిలో శారీరకంగా చిన్న చిన్న తేడాలు మొదలయ్యేసరికి అవేంటో తెలియక పిల్లలూ, వారితో పాటు ఇంట్లోని పెద్దలూ కంగారు పడవచ్చు.
హార్మోన్లలో మార్పులు, అవాంఛిత రోమాలు, పీరియడ్స్, మానసికంగా చికాకుకిలోను కావడం.. ఇలా యుక్తవయసు మార్పులు మొదలయ్యే క్రమంలో ఆడపిల్లల శరీరంలో పలు మార్పులు సహజం. ఇంట్లోని పెద్దలూ, ముఖ్యంగా తల్లులు, ఆ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటి గురించి పిల్లలతో మాట్లాడటం, రుతుస్రావానికి సంబంధించిన విషయాల పట్ల వారికి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఆయా సమయాల్లో పాటించాల్సిన జాగ్రత్తల గురించి వారికి ముందు నుంచే సవివరంగా తెలియ చేయాలి. అందుకు ముందుగా తల్లిదండ్రులకి అవగాహన ఉండడం ఎంతో అవసరం. అప్పుడే వారు పిల్లలతో ఇబ్బంది పడకుండా శాస్త్రీయంగా ఈ విషయం గురించి చర్చించగలుగుతారు. పిల్లల సందేహాలకు హేతుబద్ధమైన వివరణ ఇవ్వగలుగుతారు.
ప్రప్రథమ యుక్తవయసు సంకేతం?
వక్షోజాల అభివృద్ధి, ఛాతీపై చనుమొనల కింద సున్నితమైన చిన్న రొమ్ము మొగ్గలు. ఈ తరం వారిలో ఎనిమిదేండ్ల వయసులోనే, రుతుస్రావానికి రెండు మూడేండ్ల ముందే సూచికలు కనిపిస్తున్నాయి. బాల్య-ఊబకాయం, ఎక్కువగా చక్కర, కొవ్వుతో కూడిన అధిక పోషకాలు తీసుకోవటం, శరీరానికి వ్యాయామం లేని జీవన విధానాలు వంటి పలుకారణాల వల్ల ఇలా జరుగుతుంది. ఇవి రెండు వైపులా సమానంగా ఉండకపోవచ్చు, ఒక వైపు ఎక్కువగా వృద్ధి చెందవచ్చు, నొప్పితో కూడుకొని ఉండవచ్చు, నొప్పి ఒక వైపే ఉండవచ్చు, ఇవన్నీ సర్వసాధారణం. పెరుగుదలతో కాలక్రమేణా సర్దుకొనిపోతాయి.
నూగు జుట్టు?
జననేంద్రియ వెలుపలి చర్మమడతలపై, చంకల్లో, కాళ్లపై, చేతులపై జుట్టు పెరగడం మొదలౌతుంది. ఇదే కొందరిలో రుతుక్రమ ప్రథమ సంకేతం కూడా కావొచ్చు.
కొవ్వు స్థాయులు?
శరీరంలో పలు చోట్లలో పెరిగి ఆకృతిలో మార్పులు కలగడం సహజం. చర్మంపై కొంత జిడ్డు పేర్కొనడం, ముఖంపైన మొటిమలు, చంకలలో దుర్వాసన వంటివి కూడా కొందరిలో వెనువెంటనే జరిగిపోతూ ఉండవచ్చు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే కొందరిలో యోని నుండి తెల్లగా/చిక్కగా/జిగురుగా/అప్పుడప్పుడు పల్చగా.. ఇలా శరీరంలో ఉత్పన్నమౌతున్న హార్మోన్ల స్థాయిని బట్టి స్రావం జరుగవచ్చు. సామాన్యంగా యోని స్రావం జరిగిన ఏడాదిలోపే రుతుస్రావం ప్రారంభమవొచ్చు.
ఎత్తు పెరగడం?
ఈ వయసులోనే మొదలౌతుంది. ఆడపిల్లల్లో అత్యంత వేగంగా ఎత్తు ఎదగడం రుతుస్రావం ప్రారంభం కాకమునుపే, అంటే, ఎనిమిది నుండి పదకొండు పదమూడేండ్లలోపే జరిగిపోతుంది. సాధారణంగా ఈ వయసులో ఆడపిల్లలు క్లాస్ లోని తోటి మగ సహవిద్యార్థుల కన్నా పొడవుగా ఉండడం గమనించే ఉంటారు! ఆ తర్వాత పద్దెనిమిదేండ్ల లోపు అదనంగా ఒకటి రెండు ఇంచులు మాత్రమే పెరగవచ్చు.
రుతుస్రావం?
ఆడపిల్లలు యుక్తవయసులోకి అడుగిడే దశ ఆరంభాన్ని సూచించే శారీరిక మార్పుల్లో ఆఖరున జరిగేది. దీని ఆరంభంతో ఆడపిల్లకు యుక్తవయసు వచ్చిందని, ఆమెలో ప్రతి రుతు చక్రం పద్నాల్గవ రోజున అండం విడుదలౌతుందని, రుతుక్రమం నిలదొక్కుకున్న తర్వాత ఆమె మాతృత్వానికి సంసిద్ధురాలని అర్థం చేసుకోవాలి. సాధారణంగా చాలామంది ఆడపిల్లల్లో పది-పదమూడేండ్ల మధ్య రుతుచక్రం ప్రారంభమవుతుంది. అయితే కొంతమందికి ఎనిమిదేండ్ల వయసులోనే/పదమూడేండ్ల తర్వాత కూడా నెలసరి మొదలవ్వచ్చు.
నాలుగు దశల్లో…
రుతుక్రమం సాధారణంగా యువతుల్లో ఒక రుతుచక్ర సమయం నాలుగు నుండి ఐదు వారాలు-మెన్స్ట్రుల్, ఫోలిక్యూలర్, ఓవులేషన్, లుటిఎల్ అని పిలవబడే నాలుగు దశల్లో జరుగుతుంది. మెన్స్ట్రుల్-రుతుస్రావం ఒకటో రోజు నుండి మూడు/ఐదు రోజుల వరకు, ఫోలిక్యూలర్-రుతుస్రావం మొదలు నుండి దాదాపు పదమూడు/పద్నాలుగు రోజుల వరకు, కచ్చితంగా పద్నాలుగో రోజున అండ విడుదల జరగడాన్ని ఓవులేషన్, ఆ తర్వాత లుటిఎల్ దశ-అండం గర్భాశయం చేరుకుంటుంది.
ఆ దశలో గర్భాశయ లోపలి పొరల్లో గర్భధారణకు వీలుగా తయారయ్యే ప్రయత్నం మొదలౌతుంది. ఆ ప్రక్రియ పూర్తయ్యేటప్పటికి అండ ఫలదీకరణం జరగకపోతే రుతుస్రావం మొదలౌతుంది. దీనికి స్థిరంగా పద్నాలుగు రోజులు పడుతుంది. కొందరిలో అండ విడుదల సమయంలో (రుతుస్రావం మొదటి రోజునుండి సుమారు పద్నాలుగు రోజులు) కొంత అసౌకర్యం/ పొత్తికడుపు నొప్పి కలుగవచ్చు. రుతుస్రావం మొదటి/రెండో రోజు కొందరికి స్వల్ప/ ప్రసవ నొప్పులు తలపించేంత తీవ్ర మైన పొత్తికడుపు నొప్పి కలుగవచ్చు. అరుదుగా కడుపులో వికారంగా ఉండడం, వాంతులు కూడా జరుగవచ్చు. వైద్య సేవల అవసరం రావొచ్చు.
ముందే అవగాహన అవసరం
రుతుక్రమం ఆరంభంలో పైన పేర్కొన్న విధంగా అందరిలో జరుగవు. చాలావరకు పదహారు/పద్దెనిమిదేండ్ల వయసు వరకు అండం తయారుకాదు. అండరహిత రుతుస్రావం జరుగుతుంది. వాటిని ఆన్‌ఓవులేటరీ సైకిల్స్ అంటారు. ఇంకొందరిలో రుతుస్రావం క్రమబద్ధంగా కాకపోవచ్చు. మొదటిసారి జరిగిన ఆరు నెలలవరకు కూడా రెండో నెలసరి రాకపోవచ్చు. అరుదుగా క్రమం లేకుండా నాలుగువారాలు తిరక్కుండానే మళ్ళీ రావొచ్చు. ఇలా క్రమరాహిత్యంగా రుతుచక్రం ఉండవచ్చు. కొందరిలో నెలసరి రుతుస్రావం ఒక్క రోజే కావొచ్చు.
వారి స్నేహితురాళ్ళకి మూడు నుండి ఐదు రోజులు/చిన్న చుక్కలుగా/పాంటీలో రక్తమరకగా-ఇలా పలురకాలుగా జరగవచ్చు. అన్నీ సహజమైనవే! ఈ మార్పుల గురించి పిల్లలకు ముందే తెలిపి, తగిన జాగ్రత్తలు కూడా తల్లులు సూచించాలి. శానిటరీ న్యాప్‌కిన్స్ ఉపయోగించే విధానం తెలిపి, వాటిని వారు రోజూ తీసుకెళ్లే స్కూల్ బ్యాగుల్లో పెట్టుకోమనాలి. అవసరమైనప్పుడు వాడుకోమని చెప్పాలి. తద్వారా మొదటిసారి పిరియడ్ గురించిన అవగాహన ఉండి ఆ సమయంలో కంగారు పడకుండా ఉంటారు. అలాగే నెలసరి మొదలైన తర్వాత పాటించాల్సిన పరిశుభ్రత, ఎదురయ్యే శారీరక మార్పులు, ఇబ్బందులు వంటి అంశాలపై కూడా వారికి ప్రాథమిక అవగాహన కల్పించాలి.
- డా|| మీరా, ఎం.డి. రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా మెడికల్ కాలేజ్



