రాజకీయ నాయకుల దృష్టి స్థానిక సంస్థలపైనే..
రిజర్వేషన్లపై గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇవే చర్చలు..
ఆశావహుల్లో ఎడతెగని ఉత్కంఠ
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఇక గ్రామాల్లో వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికలపై దృష్టి పెట్టారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఏ పార్టీ నాయకుల నోట విన్నా, రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయనే అంశంపైనే మాట వినిపిస్తుంది. రిజర్వేషన్లు మారుతాయా లేదా పాత వాటినే కొనసాగిస్తారా అనేది గ్రామాల్లో చర్చ జరుగుతుంది. స్థానిక సంస్థలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నాయకుల్లో గుబులు రేపుతున్న ప్రశ్నలు. జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా వీటి గురించే చర్చ జరుగుతుంది. ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ 42% పెంచుతున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేపట్టి ఇప్పటికే గవర్నర్కు ఆమోదం కోసం పంపించినట్లు అధికార పార్టీ వర్గాల సమాచారం.ఇప్పటికే స్థానిక సంస్థలకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నాయకులల్లో భయం పట్టుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆలోచనలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఇతర పార్టీ నాయకులు కూడా రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయని చర్చించుకుంటున్నారు. ఎవరికివారు అంచనాలు వేసుకుంటున్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే వస్తే స్వయంగా, కొత్తగా మారితే మరొకరు ఉండాలని ఆలోచనలు కూడా నాయకులు చర్చలు సాగిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదేండ్లు రిజర్వేషన్లు ఉంటాయని ప్రకటించడంతో గ్రామాల్లో గతంలో హడావుడి చేసిన నాయకులు ప్రభుత్వం స్పష్టత వచ్చినప్పడు ఆలోచనలు చేద్దామంటున్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికలు ఇచ్చిన హామీ అమలు చేస్తుందా అమలు చేస్తే, ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే తప్పనిసరిగా బీసీ గణన చేస్తే గానీ స్పష్టత రాదని అప్పటి ివరకు రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉండకపోవచ్చని వాదన కూడా వినిపిస్తుంది.
స్థానిక సంస్థల చర్చలే ప్రధాన అంశం…
జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా ఇప్పుడు ఆయా పార్టీల నాయకుల్లో మా పార్టీలో మా వర్గం నుంచి పలాన వ్యక్తి సర్పంచ్ అభ్యర్థి,పలాన వ్యక్తి ఎంపీటీసీ అభ్యర్థి అన్న మాటలు విని పిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యా పారం మందగించడంతో నాయకులు, కార్యకర్తలు అంతా ఖాళీగానే ఉన్నారు. వీరంతా ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, వస్తే ఎలా వివరించాలనే ఆలోచనలో పడ్డారు. ఎప్పుడైనా స్థానిక నగారం మోగే అవకాశం ఉండటంతో ఇప్పటినుంచి వారు సన్నగ్ధమ వుతున్నారు. అంతేకాదు రిజర్వేషన్ల ప్రకారం కూడా జనరల్ అయితే ఒకరు ఎస్సీ, బీసీ అయితే వారి పార్టీలోని ఆయా కులాలకు చెందిన వారు ఉంటారని అంచనాలకు వస్తున్నారు. సోషల్ మీడియాలో రోజుకో రకంగా వస్తున్నా వార్తలతో మరింత చర్చ సాగుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకూ ఎదురు చూడాల్సిందేనని పలువురు చర్చించుకుంటున్నారు.