కేరళ స్టోరీ 2 విడుదలపై హైకోర్టు స్టే సీబీఎఫ్‌సీ దృష్టిపెట్టలేదని వ్యాఖ్య
తిరువనంతపురం : వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ 2 విడుదలపై కేరళ హైకోర్టు గురువారం స్టే విధించింది. థియేటర్లలో విడుదల కావడానికి ఒక రోజు ముందుగా ఈ తీర్పు వచ్చింది. ”ప్రజల అవగాహనను వక్రీకరించే, మత సామరస్యతను దెబ్బతీసే సామర్ధ్యం” ఇప్పటికే విడుదలైన టీజర్ కంటెంట్‌లో వుందని కోర్టు పేర్కొంది. జస్టిస్ బెచూ కురియన్ థామస్ ఈ మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ చిత్రానికి సర్టిఫికెట్ మంజూరు చేసేటపుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) దీనిపై సరిగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చిత్రం విడుదలకు సిబిఎఫ్‌సి అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ కన్నూర్‌కి చెందిన శ్రీదేవ్ నంబూద్రి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల్లో అసమ్మతిని కలగజేసే, శాంతి భద్రతలను కల్లోలపరిచే ధోరణి, ఈ టీజర్ కంటెంట్‌కు వుందని, చివరకు సామాజిక సామరస్యతను కూడా దెబ్బతీయగలదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇది, రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ కింద భావ ప్రకటనా స్వేచ్ఛ పరిధిలోకి రాదని అన్నారు. పిటిషనర్లు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్లను రెండు వారాల్లోగా పరిశీలించాల్సిందిగా జస్టిస్ థామస్ సీబీఎఫ్‌సీని ఆదేశించారు. సిబిఎఫ్‌సి తాజాగా ఉత్తర్వులు జారీ చేసేవరకు ఈ చిత్రం విడుదల కాబోదని పేర్కొన్నారు. అన్ని పక్షాల వాదనలు వినేంతవరకు చిత్ర విడుదలను నిలుపు చేసే అవకాశం వుందని గత విచారణ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. ”కేరళ ప్రజలు పూర్తి సామరస్యతా వాతావరణంలో జీవిస్తున్నారు. కానీ ఇది కేరళవ్యాప్తంగా జరుగుతోందని మీరు చిత్రీకరించారు. ఇది తప్పుడు సూచన, పైగా ఉద్రేకాలను రెచ్చగొట్టే అవకాశం కూడా వుంది.” అని హైకోర్టు ఈ నెల 24న వ్యాఖ్యానించింది. చిత్ర ప్రమోషన్ కోసం ఈ నెల 23న ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా, దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్‌ను జర్నలిస్టులు నిలదీశారు. బలవంతపు మత మార్పిడుల బాధితులంటూ చిత్ర బృందం తీసుకొచ్చిన 30 మంది మహిళల్లో ఒక్కరూ కేరళ వారు కాకపోవడం విశేషం.



