రూ.20 లక్షలతో పనులు ప్రారంభం...
నవతెలంగాణ – బజార్‌హత్నూర్
గిరిజన విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా మండలంలోని జాతర్ల ఆశ్రమ పాఠశాలలో రూ.20 లక్షల కేంద్ర నిధులతో చేపట్టనున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. పీఎం జన్మన్ (ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్) పథకం నిధులతో చేపడుతున్న ఈ పనులకు ఐటీడీఏ డీఈ శివప్రసాద్, స్థానిక సర్పంచ్ మెస్రం మాధవ్, బీజేపీ నాయకులు భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్త శంకర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ప్రత్యేక చొరవతో మండలంలోని మడగూడ, జాతర్లతో పాటు ఐటీడీఏ పరిధిలోని బజార్‌హత్నూర్ ఆశ్రమ పాఠశాలల్లో కేంద్ర నిధులతో మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్త శంకర్, ఆల్కె గణేశ్, నానం రమణ, పీఏసీఎస్ చైర్మన్ మేకల వెంకన్న, దేగామ ఉపసర్పంచ్ బొడ్డు భోజన్న, చాట్ల సుఖ్‌దేవ్, సుది వినాయక్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)