- సీపీఐ (ఎంఎల్) మాస్ రాష్ట్ర నాయకురాలు కె. రమ
- రాష్ట్ర నాయకులు ఎం. కృష్ణ
- ముగిసిన మాస్ లైన్ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు
నవతెలంగాణ-సత్తుపల్లి
సోషలిస్టు రాజ్య స్థాపన కోసం దేశంలోని కమ్యూనిస్టు పార్టీలన్నీ ఐక్యంగా పోరాడాల్సిన తక్షణ అవసరం ఉందని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకురాలు కె. రమ, రాష్ట్ర నాయకులు ఎం. కృష్ణ అభిప్రాయపడ్డారు. పార్టీల మధ్య సిద్ధాంత ఐక్యత కొరవడితే గ్రూపులు, ముఠాలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. సత్తుపల్లిలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు జి. రామయ్య, ముద్దా బిక్షంల అధ్యక్షతన మంగళవారం సత్తుపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతుల మూడో రోజు ముగింపు కార్యక్రమంలో కె. రామ, ఎం. కృష్ణ ముఖ్య వక్తలుగా పాల్గొని కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం-పని విధానం, వర్గం - కులం, శాస్త్రీయ దృక్పథం, కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ అంశాలపై ప్రసంగించారు. కార్మిక, రైతాంగ వర్గ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే సరైన మార్క్సిస్టు సిద్ధాంతం కలిగిన విప్లవకర కమ్యూనిస్టు పార్టీ ఆవిష్కరణ (ఉద్భవం) తక్షణ ఆవశ్యకత ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిస్థితులను నేపథ్యంలో ఎంతైనా ఉందన్నారు.
ఆచరణ, చర్చల ద్వారానే సరైన ఐక్యత సాధించవచ్చని స్పష్టం చేశారు. పాత నిరంకుశ పాలనను కూల్చివేసి, నూతన రాజ్యాంగ యంత్రాంగం ఏర్పాటుతో శ్రామిక రాజ్యం పాత నిరంకుశ పాలక వర్గాన్ని కూల్చివేసి, నూతన రాజ్యాంగ యంత్రాన్ని ఏర్పాటు చేసినప్పుడే నిజమైన శ్రామిక రాజ్యం ఏర్పడుతుందని రమ, కృష్ణ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల వైఖరి వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పాలకులు ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి తీవ్రమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారన్నారు.
భావప్రకటనా స్వేచ్ఛపై పాలకుల దాడులు తీవ్రతరం
భావప్రకటనా స్వేచ్ఛపై పాలకులు దాడులు తీవ్రతరం చేశారని ధ్వజమెత్తారు. దేశంలో అనాదిగా ఉన్న వర్ణ వ్యవస్థ మూలంగా వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయని, ఆ ప్రాతిపదికన కొన్ని కులాలకు సామాజిక అస్తిత్వమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో కులాన్ని వర్గంలో ఒక భాగంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. పాలక వర్గాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కులం, మతం పేరుతో శ్రామిక వర్గ ప్రజలను విడదీసి పబ్బం గడుపుకుంటున్నాయని విమర్శించారు.
పారిశ్రామికీకరణ, ఉత్పత్తి సంబంధాల మార్పులతోనే కుల వ్యవస్థ నిర్మూలన
పారిశ్రామికీకరణ వేగవంతమై, ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు వచ్చినప్పుడే కుల వ్యవస్థ పూర్తిగా ధ్వంసమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. సమాజంలో పెరిగిపోతున్న మూఢనమ్మకాలు, సైద్ధాంతిక రాద్ధాంతాలను ఎదుర్కొనేందుకు ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, విమర్శనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించాల్సిన బాధ్యత విప్లవ శక్తులపై ఉందన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులకు తెలంగాణలోని 15 జిల్లాల నుంచి సుమారు 200 మందికి పైగా పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు.
ప్రజా పోరాటాలను ఉధృతం చేయడం, పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై తరగతుల్లో విస్తృతంగా చర్చించారు. ఈ ముగింపు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుతో పాటు రాష్ట్ర నాయకులు గుమ్మడి (మాజీ ఎమ్మెల్యే) నరసయ్య, కెచ్చల రంగారెడ్డి, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, సీవై పుల్లయ్య, ఆవుల అశోక్, కె. కల్పన, జి. లలిత, కూకలకుంట రవి, అమర్లపూడి రాము, జి. ప్రభాకర్, కాటినేని శ్రీనివాసరావు, నూపా భాస్కర్, గంటా శ్రీనివాసరావు, లాజర్, అమర్లపూడి శరత్, పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)