Magazines

సత్తుపల్లిలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర స్థాయి 'రాజకీయ శిక్షణ' తరగతులు

43 నిమిషాల క్రితం

CPIML
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 2 నిమిషాల చదవడం

- ఈ నెల 11 నుంచి 13 వరకు మాధురి ఫంక్షన్ హాల్‌లో నిర్వహణ

- రాష్ట్రవ్యాప్తంగా పాల్గొననున్న 200 మంది డెలిగేట్స్

- రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు

నవతెలంగాణ-సత్తుపల్లి 

​ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు సత్తుపల్లిలోని మాధురి ఫంక్షన్ హాల్‌లో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోకినేపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. ​స్థానిక నీలం రామచంద్రయ్య భవన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మార్క్సిస్ట్ సైద్ధాంతిక, రాజకీయ కృషిలో భాగంగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు జరుగుతాయని వారు  పేర్కొన్నారు. ​ఈ రాజకీయ విజ్ఞాన తరగతులకు రాష్ట్ర నలుమూలల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు (డెలిగేట్స్) హాజరవుతారని వివరించారు. ​

శిక్షణ తరగతులు జరిగే విధానం ఇలా....

మూడు రోజులపాటు జరిగే ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో పలు అంశాలపై ప్రతినిధులకు బోధన ఉంటుందన్నారు. ​11వ తేదీ ఉదయం మార్క్సిస్ట్ తత్వశాస్త్రం, సాయంత్రం కులం - అంబేద్కరిజం,  అంశాలపై ప్రసంగాలు ఉంటాయన్నారు.​12వ తేదీ ఉదయం సరుకు - శ్రమ - పెట్టుబడి అంశం,  సాయంత్రం విప్లవ పార్టీ  అంశంపై పాఠాలు బోధిస్తారని తెలిపారు.13వ తేదీ ఉదయం జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై, సాయంత్రం నిర్మాణం - పని విధానం అంశాలపై బోధన ఉంటుందని కోటు రంగారావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ శిక్షణ తరగతులలో నాతో పాటు (రంగారావు) పార్టీ నాయకులు ఎం. కృష్ణ, ఎస్.ఎల్. పద్మ, ఎం. హన్మేష్, కె. సూర్యం, కె. రమ తరగతులు బోధిస్తారని వెల్లడించారు.

​సోషలిస్ట్ సమాజ నిర్మాణమే లక్ష్యంగా...

ప్రస్తుత పెట్టుబడిదారీ విధానంలో తీవ్ర అసమానతలు, వైరుధ్యాలు పెరుగుతున్నాయని పోటు రంగారావు, గోకినేపల్లి  వెంకటేశ్వరరావు నాయకులు విమర్శించారు. సామ్రాజ్యవాదం అనేది  ప్రపంచ వనరులను దోచుకోవడానికి యుద్ధాలు సాగిస్తూ మారణహోమాన్ని సృష్టిస్తోందన్నారు. పెట్టుబడిదారీ సమాజం దోపిడీకి, నిరుద్యోగానికి, దారిద్య్రానికి నిలయంగా మారిందని, ఇది మానవ ప్రజాస్వామిక విలువలకు హాని కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.


​దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా విప్లవ పోరాటాల ద్వారా సోషలిస్టు సమాజాన్ని నిర్మించడమే సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆ లక్ష్య సాధనకు కార్యకర్తలలో రాజకీయ పరిజ్ఞానం, నిర్మాణ చైతన్యం పెంచడానికే ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ​ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య, నాయకులు గోకినేపల్లి లలిత, గంట శ్రీనివాసరావు, బీరెల్లి లాజర్, అమర్లపూడి శరత్, ఒగ్గు నాగిరెడ్డి, తాటి రాజు, కోర్సా వెంకటేష్, కె. పుల్లారావు, జె. మాల్యాద్రి, మంగయ్య, దేవి, అలివేలు, వెంకట నరసమ్మ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్