- సీఎస్ఆర్ నిధులతో నిర్మించే గృహ సముదాయాలకు భూమి సేకరించాలి
- తహశీల్దార్లతో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఐటీడీఏ పీవో రాహుల్ సమీక్ష
నవతెలంగాణ - అశ్వారావుపేట
రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సూచించారు. బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం లో నియోజకవర్గ పరిధిలోని తహశీల్దార్ లు, ఐటీడీఏ పీవో బి. రాహుల్‌తో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలు, ప్రజల నుంచి అందుతున్న వినతులు, భూ సంబంధిత అంశాలు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై సమీక్షించారు. నిబంధనల ప్రకారం సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. పెండింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
సీఎస్ఆర్ నిధులతో ప్రభుత్వం నిర్మించనున్న గృహ సముదాయాలకు అశ్వారావుపేట నియోజకవర్గం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన నేపథ్యంలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో రెండు నుంచి మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి సేకరించాలని తహశీల్దార్లను ఎమ్మెల్యే ఆదేశించారు. ఇప్పటివరకు ఆయా మండలాల్లో సేకరించిన భూమి వివరాలతో నివేదిక అందించాలని ఐటీడీఏ పీవో బి. రాహుల్ కోరారు.
సమావేశంలో దమ్మపేట డిప్యూటీ కలెక్టర్, ఎమ్మార్వో ఎం. మురళి, అశ్వారావుపేట తహశీల్దార్ దాసరి కిశోర్‌తో పాటు నియోజకవర్గంలోని ఇతర మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)