- సిద్దారం, గౌరిగూడెంలో రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలన
నవతెలంగాణ-సత్తుపల్లి: పేదల ఇళ్ల స్థలాల కోసం డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ నేతృత్వంలో ప్రభుత్వ భూముల అన్వేషణ వేగవంతమైంది. ఈ సందర్భంగా శుక్రవారం సత్తుపల్లి మండలంలోని సిద్దారం, గౌరిగూడెం గ్రామాలలో రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. సిద్ధారం రెవెన్యూ పరిధిలోని ఏనుగుట్ట ప్రాంతంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఈ భూమిని ఇళ్ల స్థలాల పట్టాలుగా మంజూరు చేసే అంశంపై అధికారులతో దయానంద్ విజయకుమార్ చర్చించారు.
అక్కడ ఇళ్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలు, సాంకేతిక అంశాలపై తహసీల్దార్, రెవెన్యూ సిబ్బందితో సుదీర్ఘంగా సమీక్షించారు. సొంతిల్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ప్రభుత్వం ద్వారా త్వరలోనే స్థలాలు అందిస్తామని ఆయన తెలిపారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేసేందుకు తన వంతుగా శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన ఏ ఒక్క నిరుపేద కుటుంబానికి అన్యాయం జరగకుండా రెవెన్యూ అధికారులు పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి తహసీల్దార్ పున్నం సత్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు మట్టా చెన్నారావు, గోళ్లమూడి మధు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)