- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
- ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ శ్రేణులతో సన్నాహక సమావేశం
నవతెలంగాణ-సత్తుపల్లి
త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను గులాబీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు. సత్తుపల్లిలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్‌లో ఆయన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటు నమోదు అయ్యేలా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వైద్యులు, ఇతర గ్రాడ్యుయేట్ ఓటర్లను గుర్తించి ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు.
అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు పూర్తయ్యే వరకు ప్రత్యేక దృష్టి సారించి, ఇంటింటికీ వెళ్లి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లు దసరా సెలవులకు స్వగ్రామాలకు వచ్చే అవకాశం ఉన్నందున, ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని వారి ఓట్లను నమోదు చేయించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను బీఆర్ఎస్‌కు అనుకూలంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ... ప్రియాంక గాంధీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌తో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని తెలిపారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరును గుర్తించి ఓటు హక్కు కల్పించేలా గులాబీ శ్రేణులు చురుగ్గా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, పట్టణ బీఆర్ఎస్ నాయకులు మల్లూరు అంకమరాజు, దొడ్డా శంకరరావు, బొడ్డు శివరామకృష్ణ, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కూసంపూడి రామారావు, మోదుగు పుల్లారావు, అమరవరపు కృష్ణారావు, మందపాటి వెంకటరెడ్డి, షేక్ కాశీం, చిన్నంశెట్టి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)