Magazines

సమాజాన్ని శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేయాలి

1 గంట క్రితం

scientific perspective.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 2 నిమిషాల చదవడం

- సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు

- సత్తుపల్లిలో మాస్ లైవ్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల ప్రారంభం

నవతెలంగాణ-సత్తుపల్లి 

సమాజాన్ని శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేసినప్పుడే దానిలోని సమస్యలకు సరైన పరిష్కారం చూపగలమని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు స్పష్టం చేశారు. సత్తుపల్లిలో మూడు రోజులు పాటు జరిగే రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతుల కార్యక్రమంలో రంగారావు పాల్గొని తత్వశాస్త్రం అంశంపై మాట్లాడారు. సమాజంలో వేళ్లూనుకున్న అసమానతలను రూపుమాపే శక్తి కేవలం మార్క్సిజానికి మాత్రమే ఉందన్నారు. దోపిడీ, పీడన లేని వ్యవస్థ కోసం పోరాడే కమ్యూనిస్టులు

సమాజంలోని వైరుధ్యాలను మార్క్సిస్టు దృక్కోణంలోనే పరిశీలించాలని సూచించారు.


మార్క్సిజం అనేది పిడివాదం కాదని, అదొక సామాజిక శాస్త్రమని అన్నారు. ఆయా దేశాల కాలమాన పరిస్థితులకు అనుగుణంగా

మార్క్సిజాన్ని అనువర్తింపజేసుకోవాలని తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. సిద్ధాంతాన్ని ఆచరణతో సరిచూసుకోవాలని మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావోలు బోధించారని గుర్తుచేశారు. సాయంత్రం పార్టీ నాయకురాలు ఎస్.ఎల్. పద్మ సరకు, శ్రమ, అదనపు విలువ అంశాలపై బోధించారు. ​కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, రాజ్యాంగ వ్యవస్థలను హస్తగతం చేసుకుని ఫాసిజం వైపు అడుగులు వేస్తోందని నాయకులు కెచ్చల రంగారెడ్డి, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, కె. రమ, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ధ్వజమెత్తారు.


దేశ వనరులను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఈ  ​రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభానికి ముందు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోకినేపల్లి వెంకటేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ రాష్ట్ర, ఖమ్మం జిల్లా నాయకులు సీవై పుల్లయ్య, ముద్దా భిక్షం, ఎస్కే గౌస్, ఆవుల అశోక్, అమర్లపూడి రాము, కూకలకుంట రవి, జి. లలిత, కె. కల్పన, జి. ప్రభాకర్, గంటా శ్రీనివాసరావు, బీరెల్లి లాజర్, తాటి రాజు, ఒగ్గు నాగిరెడ్డి, కొర్సా వెంకటేష్, పరిమళ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్