టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
చత్రపతి విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ
నవతెలంగాణ-సంగారెడ్డి
ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను ఒక మతానికి పరిమితం చేయడం సరికాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి బైపాస్ రోడ్డులో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, రాజ్య భద్రతకు ప్రాధాన్యమిచ్చిన గొప్ప ప్రజా నాయకుడు శివాజీ అని పేర్కొన్నారు.
శివాజీ చరిత్రను బీజేపీ రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించి ప్రచారం చేస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు. శివాజీ పాలనలో హిందువులతో పాటు ముస్లింలు కూడా ఉన్నారని, దౌలత్ ఖాన్, ముల్లా హైదర్ వంటి ముస్లిం అధికారులు ఉన్నత స్థాయిలో పనిచేశారని ఆయన తెలిపారు. కులమతాలకు అతీతంగా తన రాజ్యంలోని ప్రజల బాగోగుల కోసం శివాజీ కృషి చేశారని అన్నారు. గొప్ప వీరుడైన శివాజీ ప్రజల సంక్షేమం పట్ల నిబద్ధతతో పాలన సాగించారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఒక రాజుగా ముస్లిం పాలకులతో యుద్ధాలు చేశారే తప్ప, ముస్లిం ప్రజలపై దాడులు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాలకు మతపరమైన అర్థాలు ఆపాదించడం సరికాదని అన్నారు.
యువత శివాజీ మహారాజ్ చరిత్రను అధ్యయనం చేసి, ఆయన వీరత్వం, పాలనా దక్షత, ప్రజల పట్ల నిబద్ధతను తెలుసుకోవాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మహనీయుల చరిత్రను వక్రీకరించడం తగదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి మాజీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్, కాంగ్రెస్ నాయకులు కిరణ్ గౌడ్, కూన సంతోష్, బొంగుల రవి, కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)