నవతెలంగాణ చెప్పింది అక్షర సత్యం
నవతెలంగాణ - అచ్చంపేట
మండల పరిధిలోని శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధిగాంచిన ఉమామహేశ్వరం దేవస్థానంలో గత 15 ఏళ్ళుగా కార్యా నిర్వహణ కార్యదర్శి (ఈఓ) గా శ్రీనివాసరావు విధులు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగికి సాధారణంగా రెండు, మూడు ఏళ్లకు ఒక చోట నుంచి మరో చోటుకు బదిలీలు కావడం సర్వసాధారణం.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా శ్రీనివాసరావు గత చాలా ఏళ్లుగా ఉమామహేశ్వరంలో విధులు నిర్వహిస్తున్నాడు. అధికారంలో ఏ పార్టీ ఉంటే.. ఆ పార్టీకి, నాయకులకు కొమ్ము కస్తూ.. వారు చెప్పిన వారిని పనిలో పెట్టుకొని ప్రతినెలా వేతనాలు చెల్లిస్తున్నాడని ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఉమామహేశ్వరుని సొమ్ముకు భద్రత కరువైందని చెప్పుతూ.. నవతెలంగాణలో 7 నెలల క్రితమే వార్త రాయడం జరిగింది. ఆలస్యం అయినప్పటికీ నవతెలంగాణ పత్రిక చెప్పింది అక్షరాలా నిజమైంది.
10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేవాలయంలో కొందరిని పనులు పెట్టుకొని ఒక్కొక్కరికి రూ.12000/-రూ 15000/- ప్రతినెల జీతం చెల్లించారని, అయితే ఇందులో కొందరు పనికి రాకపోయినప్పటి రిజిస్టర్ లో పేర్లు నమోదు చేసి, ప్రతినెల జీతాలు తీసుకున్నట్లు, హుండీ లెక్కింపు సందర్భంలో డబ్బులు దేవాలయం ఖాతా బ్యాంకులో జమ చేయకుండా ఇష్టానుసారంగా ఖర్చు చేసినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. మళ్లీ ఇటీవల దేవాలయానికి సంబంధించిన రూ 13. లక్షలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఈవో బదిలీకి ఇదే ప్రధాన కారణమని పట్టణంలో జోరుగా చర్చ జరుగుతోంది.
అయితే ఈ విషయంపై ఆలయ కమిటీ చైర్మన్ మాధవరెడ్డిని నవతెలంగాణ వివరణ కోరగా.. ఈఓ శ్రీనివాస రావు బదిలీ అయిన విషయం వాస్తవమే అన్నారు. సాధారణ బదిలీలలో భాగంగా చాలా ఏళ్ళుగా ఇక్కడ పనిచేయడం వల్ల దేవాదాయ శాఖ కమిషనర్ బదిలీ చేశారని తెలిపారు. డబ్బులు పక్కదారి పట్టినట్లు వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని తెలిపారు. అసత్యపు ఆరోపణలు భక్తులు నమ్మొద్దని తెలిపారు.







కామెంట్‌లు (0)