పంట నష్టంపై సమగ్ర సర్వే చేయాలి.. పత్తి రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలి
– బిఆర్‌ఎస్ నాయకులు కుండే సంపత్
నవతెలంగాణ-ఆలేర్ రూరల్
బలహీనమైన రుతుపవనాలు, వర్షాభావ పరిస్థితులతో ఆలేరు మండలం,గ్రామల రైతులు కరువు కోరల్లో చిక్కుకున్నారని బిఆర్‌ఎస్ నాయకులు కుండే సంపత్ అన్నారు.బుధవారం ఆయన నవతెలంగాణ విలేకరితో మాట్లాడుతూ నీటి లభ్యత తగ్గిపోవడంతో వరి, పత్తి, కూరగాయల సాగు గణనీయంగా తగ్గడంతో పాటు సాగు చేసిన పంటల్లోనూ దిగుబడులు భారీగా పడిపోయాయని తెలిపారు. ముఖ్యంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరాకు రెండు క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదన్నారు. పెట్టుబడులు పెరిగి, దిగుబడులు తగ్గడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం వెంటనే ప్రతి గ్రామంలో పంటల వారీగా సమగ్ర సర్వే నిర్వహించి నష్టాన్ని అంచనా వేయాలని,కరువు నివారణ ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల కింద నష్టపోయిన ఆలేరు మండలంలోని ప్రతి పత్తి రైతుకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.వర్షాభావంతో పశుగ్రాసం కొరత కూడా తీవ్రంగా ఏర్పడిందని, పాడి రైతులు పశువులను పోషించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి ప్రతి పాడి గేదెకు నెలకు ఒక క్వింటాల్ చొప్పున దాణా ఉచితంగా అందించి పాడి రైతులను ఆదుకోవాలని కుండే సంపత్ డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)