- బాధితులు లబోదిబోమన్న కనికరించని అధికార యంత్రాoగం
నవతెలంగాణ-మల్హర్ రావు : భూపాలపల్లి జిల్లాలోని మల్హర్ రావు మండలం తాడిచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని శాత్రజ్ పల్లిలో శనివారం అర్ధరాత్రి రెవెన్యూ,అటవీశాఖ, అగ్నిమాపక,సింగరేణి,పోలీస్,పంచాయతీ శాఖల అధికారులు సంయుక్తంగా 347 ఇండ్లను జేసిబిలతో కూల్సివేశారు.గ్రామ సర్పంచ్ బండి స్వామి,వార్డు సభ్యులు,బాధితులు నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను ఎలా కూల్చేస్తారని నిలదీసేలోపు పోలీస్ బలగాల బందోవస్తు మధ్య పది జేసిబిలతో ఇండ్లును నేలమట్టం చేశారు.బాధితులు లబోదిబోమని ప్రాధేయపడిన అధికారయంత్రాంగం కనికరించలేదు.ఇటీవల అధికారులు సంయుక్తంగా ఇండ్లపై విచారణ చేపట్టిన నేపథ్యంలో 85 ఇండ్లు పంచాయతీ రికార్డుల్లో ఉండగా,పరిహారం కోసం స్థానికేతరులు 347 ఇండ్లు నిర్మాణం చేపట్టినట్లుగా గుర్తించి నెంబర్లు వేశారు.గుర్తించిన 48 గంటల్లోనే ఇండ్లను కూల్చేవేయడం గమనార్హం. ఇక్కడ ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో కొయ్యుర్ పారెస్టు అధికారులు కలప అనుమతుల పేరిట ట్రాక్టర్ కు రూ.5 వేలకు పైగా వసూల్ చేసి రసీదులు ఇచ్చారని బాధితులు వాపోతున్నారు.తాడిచెర్ల బ్లాక్-2ను సింగరేణికి కేటాయిస్తున్నట్లుగా ఈ సంవత్సరం జులై 7న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడంతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించారు.వీరి పోటాపోటీ పర్యటనతో సింగరేణి రెండవ బొగ్గుగని అవుతోందనే నేపథ్యంలో పరిహారం వస్తోందనే ఆశతో బాధితులు అప్పులు చేసి ఇండ్ల నిర్మాణం చేపట్టగా, వారి ఆశ ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా కావడంతో ఆందోళన చెందుతున్నారు.ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి ఇళ్లను కూల్చివేయడంపై చట్టబద్ధత ప్రశ్నార్థకంగా మారిందని కూల్చివేతలపై విచారణ జరిపించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఉన్నతాధికారులను,ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.






కామెంట్‌లు (0)