యువకుడు అరెస్ట్.. అదుపులోకి మరో బాలుడు
బెంగళూరుకు చెందిన ప్రధాన నిందితుడి కోసం పోలీసుల గాలింపు
నవతెలంగాణ – నాచారం
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. ఎండీఎంఏ డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తూ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు గుర్తించి, ఒక యువకుడిని అరెస్ట్ చేయగా, మరో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 210 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 30న నాచారం ఎస్‌ఐ ఎన్. భాస్కర్‌కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఐడీఏ నాచారం రోడ్ నంబర్ 11లోని ఏఎం గ్రీన్ అమ్మోనియా కంపెనీ సమీపంలో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన అజిత్‌కుమార్ రాజక్ (19), మరో బాలుడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. అజిత్‌కుమార్ వద్ద ఉన్న రెండు జిప్‌లాక్ కవర్లలో తెల్లటి క్రిస్టల్ రూపంలో ఉన్న మత్తు పదార్థాన్ని గుర్తించారు. క్లూస్ టీమ్ ప్రాథమిక పరీక్షల్లో అది ఎండీఎంఏగా సూచించగా, తూకం వేయగా ఒక ప్యాకెట్‌లో 110 గ్రాములు, మరో ప్యాకెట్‌లో 100 గ్రాములు మొత్తం 210 గ్రాములు లభించాయి.
నిందితుల నుంచి రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. విచారణలో బెంగళూరుకు చెందిన ఉదయ్ అనే వ్యక్తి ద్వారా గుర్తుతెలియని వ్యక్తి నుంచి డ్రగ్స్ సేకరించినట్లు అజిత్‌కుమార్ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. వాటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని వినియోగదారులకు విక్రయించాలని ఉదయ్ సూచించినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రధానంగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్న ఉదయ్ ప్రస్తుతం పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ ఘటనపై నాచారం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 612/2026గా ఎన్‌డీపీఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్లతో పాటు జువైనైల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అజిత్‌కుమార్‌ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు, బాలుడిని జువైనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని నాచారం పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






కామెంట్‌లు (0)